Saturday, June 25, 2016

నారీలలామ నీ పేరేమి చెపుమన్న?


నారీలలామ నీ పేరేమి చెపుమన్న?


సాహితీమిత్రులారా!

ఈ పద్యాన్ని గమనించి భావం తెలపండి.

నారీలలామ! నీ పేరేమి చెపుమన్న?
        దమిమీర నెడమ నేత్రమును జూపె,
మత్తేభయాన! నీ మగని పేరేమన్న?
       దన చేతి జీర్ణ వస్త్రమును జూపె
కుటిల కుంతల! నీదు కులము నామం బన్న?
         బంజరంబున ను్న పక్షి జూపె
వెలది! నీకేమైన బిడ్డలా చెపుమన్న?
      కరమొప్ప మింటి చుక్కలను జూపె
ప్రభువు మీకెవ్వరన్న "గోప" కుని జూపె?
ధవుని వ్యాపారమేమన్న? "దండ" మిడియె
చతురమతులార! ఈ ప్రోడజాణతనము
దెలిసికొనరయ్య బుద్ధి కౌశలము మెరయ.

ఓ నిపుణమతులారా! ఒక ప్రౌఢయగు నాయిక యొక్క ఈ నేర్పరితనమును,
మీ బుద్ధిసూక్ష్మతను ఉపయోగించి,తెలిసికొని, ప్రత్యుత్తరమీయండి.

ఇందులో నారీలలామ, మత్తేభయాన, వెలది, కుటిలకుంతల -
అనేవన్నీ స్త్రీ సంబోధనా పదాలు.
ఇందులో ఆ వనిత నోటితో సమాధానం చెప్పకుండా
సంజ్ఞలతో చమత్కార చేష్టలతో సమాధానమిచ్చింది.

1. ఓ స్త్రీరత్నమా నీపేరు ఏదో చెప్పు?
   - తన ఎడమ కంటిని చూపింది - అంటే ఎడమ కంటిని
     వామ + అక్షి = వామాక్షి అని సంస్కృతంలో.
      కావున ఆమెపేరు వామాక్షి
2. ఓ మదగజగమనా నీ భర్త పేరేమి? -
   -చేతిలోని చిరిగిన వస్త్రం చూపింది.
    అంటే సంస్కృతంలో కుచేలము అంటే
    ఆయన పేరు కుచేలుడు.
3. ఓ వనితా నీకు పిల్లలెందరు?
   - ఆమె చేయెత్తి ఆకాశం చూపింది. -
     అంటే ఆకాశంలోని నక్షత్రాలు.
     మనకు నక్షత్రాలు 27
     (అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి..... మొ.)
     అనగా 27 మంది పిల్లలు.
4. ఓ ఉంగరాల జుత్తుగలదానా నీకులమేది?
   -పంజరంలోని పక్షిని చూపింది - అంటే పక్షిని
    సంస్కృతంలో ద్విజము అంటారు. కావున
    వారు ద్విజులు అంటే బ్రాహ్మణులు
5. మీకు ప్రభువు ఎవరు?
   - గోపకుని చూపింది - అంటే గోపాలుడు - కృష్ణుడు
6. నీభర్త ఉద్యోగమేమి?
   - దండం పెట్టింది. అనగా నమస్కారం చేస్తూ,
     "సీతారామాభ్యాం నమ:" (భిక్షను గ్రహించడం) లేక
     తపస్సు, పూజ చేసుకొని దండం పెట్టడం ఆయన వ్యాపారం.

దీనిలో నోటితో కాకుండా చేతితో సంజ్ఞల
రూపంలో సమాధానం గోప్యం(గూఢం) చేయబడింది
కావున ఇది "కరసంజ్ఞా గోపన చిత్రం."

No comments: