Tuesday, June 28, 2016

నలుగురు మహాకవులు కలిసి చెప్పిన శ్లోకం


నలుగురు మహాకవులు కలిసి చెప్పిన శ్లోకం


సాహితీమిత్రులారా!

ఒక్కొక్క మహాకవి తీరు ఒక్కోవిధంగా ఉంటుంది.
అలాంటిది ఒక శ్లోకాన్ని నలుగురు మహాకవులు చెబితే
ఎలావుంటుందో? అని ఒకరోజు భోజమహారాజుకు అనిపించిందట.
నిజమేకదా!
వెంటనే కాళిదాసు , భవభూతి, దండి మహాకవులను పిలిపించి
సాయంకాలంపూట ఓ చక్కని ఉద్యానవనం మందిరంలో సమావేశం
ఏర్పాటు చేశారు.
అందరూ కూర్చున్న తరువాత
మహాకవులారా! ఆ అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు కదా!
ఎంతో వింతగా కనిపిస్తున్నాడు.
మనం అందరం కలిసి ఒక శ్లోకం రాద్దాం.
మొదట నేను ఒక పాదం చెబుతాను
తరువాత ఒక్కొక్కరు ఒక్కొకపాదం చెప్పండి
అని భోజుడు
ఈ పాదం చెప్పాడు.

 పరిపతతి పయోనిధౌ పతంగః
(సూర్యుడు పడమర సముద్రంలో పడిపోతున్నాడు)
అని భోజుడు చెప్పగా
సరసిరుహా ముదరేషు మత్తభృంగః
(రోజు రోజంతా వికసించిన పద్మాలలోని మకరందాన్ని మకరందాలను తాగి తాగి ఉన్న తుమ్మెద, అదే పద్మంలో నిద్రకోసం పడకేసుకుంటోంది.)
అని దండి చెప్పాడు.
ఉపవనతరుకోటరే విహంగః
(దగ్గరగా ఉన్న ఉద్యానవనాలన్నింటిలోని
చెట్టు తొర్రల్లోకీ,
అంటే తమ తమ ఇళ్ళల్లోకి
పక్షులు చేరుతున్నాయి)
అని భవభూతి చెప్పాడు.
కాళిదాసు చివరి పాదం ఇలా పూరించాడు--
యువతి జనేషు శనై శ్శనై రనంగః
(యౌవనంలో ఉన్న స్త్రీలలోకి మెల్లమెల్లగా
మన్మథుడు ప్రవేశిస్తున్నాడు.)

పూర్తి శ్లోకం ఇది -
పరిపతతి పయోనిధౌ పతంగః
సరసిరుహా ముదరేషు మత్తభృంగః
ఉపవనతరుకోటరే విహంగః
యువతి జనేషు శనై శ్శనై రనంగః


ఈ శ్లోకం నలుగురు చెప్పినా 
అంత్యాను ప్రాస ఎలా వాడారో చూడండి.
తంగః
మత్తభృంగః
విహంగః
నంగః

No comments: