చెప్పలేకున్న నగుదు నే చిన్ననగవు
సాహితీమిత్రులారా!
ఈ క్రింది పొడుపు పద్యానికి సమాధానం ఆలోచించండి.
శ్రీమంతుడును భార్య చెలగుచు నొక్కటి
కీలంబు శాఖయు గ్రాలు నొకటి
రదనంబు కాకంబు రహిమీద నొక్కటి
యవనిక యును చాప నెనయ నొకటి
పత్రంబు గ్రావంబు పరగంగ నొక్కటి
నేత్రంబు శిశువును నెనయ నొకటి
వెన్నుండు మరికాంత వివరింప నొక్కటి
వస్త్రంబు మగజాతి వరుస నొకటి
అన్నిటికి జూడ నాల్గేసి అక్షరములు
ఏకపదముగ జెప్పుడీ యిలను బుధులు
చెప్పగలిగిన నేనిత్తు చిన్ని మాడ
చెప్పలేకున్న నగుదు నే చిన్ననగవు
ఈ పద్యంలోని ప్రశ్నలు 8
వాటికి అన్నిటికి నాలుగక్షరాల సమాధానం చెప్పాలి.
సమాధానాలకై ఆలోచిద్దాం.
1. ధనవంతుడు, భార్య - ఒకేపదంలో ఇమిడి
ఉండేపదం సమాధానమౌతుంది
ధనికురాలు (ధని - ధనం గలవాడు, ఆలు - భార్య)
2. మేకు(కీలము), శాఖ(కొమ్మ) రెండు కలిసినపదం సమాధానం-
చీలమండ(చీల - మేకు, మండ - కొమ్మ(శాఖ))
3. పన్ను(రదనం), కాకి రెండు కలిసినపదం సమాధానం -
పలుగాకి(పలు - కాకి) (పలు - పన్ను(దంతము), కాకి - పక్షి)
4. తెర(యవనిక), చాప రెండు కలిసినపదం సమాధానం -
తెరచాప (తేర- యవనిక(అడ్డువల), చాప - తుంగ,
తాటి ఆకులతో నేసినచాప)
5. పత్రము, పాషాణము(గ్రావంబు) రెండు కలిసినపదం సమాధానం-
ఆకురాయి
6. కన్ను(నేత్రం), చిన్నబిడ్డ(శిశువు) రెండు పదాలు కలిసినపదం సమాధానం-
కనుపాప
7. విష్ణువు(వెన్నుడు), కాంత రెండు కలసినపదం సమాధానం -
విష్ణుకాంత(ఒక పువ్వి)
8. బట్ట (వస్త్రం), మగజాతి రెండు కలిసినపదం సమాధానం -
చీరపోతు(తెల్లపేను)
No comments:
Post a Comment