Tuesday, June 14, 2016

ప్రమథ నాయకుడరయ శిరస్థదారు


ప్రమథ నాయకుడరయ శిరస్థదారు


సాహితీమిత్రులారా!

ఈ పద్యం భావమేమో చూడండి.

కమల గర్భుండరయగా ముఖస్థదారు,
రమకు నాయకుండరయ ఉరస్థదారు,
ప్రమథ నాయకడరయ శిరస్థదారు,
దీని భావమేమి .........

పారసీ భాషలో దార్ శబ్దానికి కలవాడు,
ఉంచుకొనువాడు - అనే అర్థాలున్నాయి.
అదే సంస్కృతంలో ధార శబ్దానికి భార్య అని అర్థం.
ఈ రెండు భాషా శబ్దాలతో కవి
త్రిమూర్తులను అన్యాపదేశంగా, చమత్కారంగా, అపహాస్యం చేస్తున్నాడు.

కమలగర్భుడు బ్రహ్మ.
బ్రహ్మ నోటిలో సరస్వతి ఉంటుందికదా!
అందుకే ముఖస్థదారు అంటున్నాడు.
రమకు నాయకుడు విష్ణువు.
విష్ణువు ఉరములో లక్ష్మీదేవి ఉంటుంది.
కావున ఉరస్థదారు అన్నాడు.
ప్రమథ గణాలకు నాయకుడు శివుడు.
శివుడు గంగను శిరస్సుపై ఉంచుకున్నాడు.
కావున ఆయన శిరస్థదారు.

ఇదే పొడుపు పద్యాన్ని వేమన పద్యాలలో

పడతి మోసెనొకడు, పడతి మేసెనొకడు
పడతి నెదను బెట్టి బ్రతికె నొకడు
పడతికొరకు నిట్లు పలుపాట్లు పడిరయా
విశ్వదాభిరామ! వినురవేమ!

దీనికి విరుగుడులాంటి పద్యం

స్త్రీ నెత్తిన రుద్రునకు
స్త్రీ నోటను బ్రహ్మకెపుడు సిరిగల్కంగా
స్త్రీ నెదిరి రొమ్మున హరికి
స్త్రీ నెడపగ గురుడవీవు దేవర వేమా!

No comments: