Monday, June 27, 2016

అన్నిటికి నుత్తరం బొక్క అక్షరంబు


అన్నిటికి నుత్తరం బొక్క అక్షరంబు


సాహితీమిత్రులారా!

ఈ క్రింది పద్యం చూచి జవాబుకై ఆలోచించిచూడండి.

సుదతిరో! ఘనమైన సురభికి పేరేది?
     శివభూషణములందు శ్రేష్ఠమేది?
చెరువు లోపల నీరు చేలకిచ్చుట కేది?
     పైరు గోసిన వెన్క పండు నేది?
బలు ఫిరంగుల ధ్వనుల్ బల్కుట నది యేది?
     చెలగి బంట్రోతులు సేయుటేది?
ఎనిమిది గడియల నేర్పడునది యేది?
     ప్రభువులు కోపంబు సేయుటేది?
అన్నిటికి జూడ నొక్కక్క యక్షరంబు
సున్న దీర్ఘంబు లేర్పడ జెప్పవలయు
చిత్త భవభంగ శివలింగ చిన్మయాంగ
వృషతురంగ శుభాంగ గౌరీశలింగ
ఈ పద్యంలో 8 ప్రశ్నలు ఉన్నాయి.
సమాధానాలన్నీ సున్న, దీర్ఘస్వరములతో కూడి
ఒకే అక్షరంగా ఉండాలి.
షరతులు తెలిశాయికదా!
ఆలోచించండి.

1. ఓ సుదతీ గొప్ప కామధేనువు పేరేమి?
    - గాం(గోవు)
2. శివుని అలంకారములలో శ్రేష్ఠమైనది ఏది?
   - పాం(పాము)
3. చెరువు నీటిలో చేలకు ఇచ్చునది ఏది ?
   - తూం(తూము)
4. జొన్న మొదలైన పైరు కోసిన తర్వాత పండునది ఏది?
   - నాం(జొన్నమొదలగు వాని పిలక)
5. అనేక ఫిరంగులు పేల్చిన శబ్దం ఎట్లుండును?
   - ధాం(ధామ్మని శబ్దం వినపడును)
6. బంట్రోతులు ఏమి చేయుదురు?
  - సాం (మంచి-తనం, మాట, లేక సలాం)
7. ఎనిమిది గడియలకు ఏది ఏర్పడును?
   - ఝాం(జాము)
8. ప్రభువులు దేనిపై కోపగింతురు?  -

 ఏడింటికి సమాధానాలు ఉంచాము
 8వదాని జవాబు మీరే ఊహించండి.

No comments: