ద్వితీయంబు దాటి యొప్పుగ వచ్చెన్
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి. ఇది ఏమిటో?
ఎంచగ చతుర్థ జాతుడు
పంచమ మార్గంబున నేగి ప్రథమ తనూజం
గాంచి తృతీయంబచ్చట
నుంచి ద్వితీయంబు దాటి యొప్పుగ వచ్చెన్
ఏమైనా అర్థమైందా? అంతేమరి గూఢచిత్రమంటే
ఇందులోని విషయం ఏమిటంటే
హనుమంతుడు సముద్రాన్ని లంఘించి,
సీతను చూచి, లంకను కాల్చి రావడం
ఇందులోని కఛాంశం.
వివరంలోకెళితే
1. పృథివి, 2. జలం, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశం - ఇవి పంచ భూతాలు.
ప్రథమ తనూజ - పృథివి (భూమి) పుత్రిక - సీత
ద్వితీయం (జలం)అంటే ఇక్కడ సముద్రం
తృతీయం బచ్చట నుంచి - అగ్నిని అక్కడ ఉంచి
చతుర్థ జాతుడు - వాయువుకు పుట్టినవాడు - హనుమంతుడు
పంచమ మార్గం - ఆకాశమార్గం
ఇప్పుడు భావం తీసుకుంటే -
చతుర్థజాతుడైన హనుమంతుడు,
పంచమ మార్గమైన ఆకాశమార్గంలో వెళ్ళి,
ప్రథమ తనూజ అయిన సీతను చూచి,
తృతీయంబచ్చటనుంచి - లంకకు అగ్గి పెట్టి,
ద్వితీయంబు దాటి - సముద్రాన్ని దాటి
ఒప్పుగ వచ్చెన్ - ఒప్పుగ వచ్చాడు.
No comments:
Post a Comment