కాంతే కుటిల మాలోక్య
సాహితీమిత్రులారా!
అర్థాన్ని కోరకుండా, శబ్దం మాత్రమే ప్రధానంగా కోరేవాటిని శబ్దాలంకారాలు అంటారు.
వాటిలో అనుప్రాసాలంకారం ఒకటి. వీనిలో అనేకరకాలున్నాయి.
వాటిలో వృత్యనుప్రాసము ఒకటి.
వృత్యనుప్రాసమంటే ఒకే హల్లు అనేకమార్లు ఆవృత్తం కావడం
(అంటే తరిగి తిరిగి రావడం)
"సముద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ దోరనుక్షణ భప్రమదసిదుర్నిదీక్ష" -
ఇందులో "క్ష" అనేది అనేకమార్లు వచ్చింది.
ఆ జెఱ్ఱి మఱ్ఱితొఱ్ఱలో బిఱ్ఱబిగిసి ఉన్నది -
ఇందులో "ఱ్ఱ" అనేకమార్లు ఆవృత్తమైనది.
కావున ఇది వృత్యనుప్రాసం అంటున్నాము.
కాని దీని పూర్తిగా సంక్షిప్తంగా చెప్పుకొంటున్నాము.
వృత్యనుప్రాసను
సరస్వతీకంఠాభరణంలో 12 విధాలని చెప్పి ఉన్నాడు.
వాటిలో ఇప్పుడు మొదటిదాన్ని గురించి తెలుసుకుందాము.
దాని పేరు కర్ణాటీ.
కర్ణాటీ అంటే "క" వర్ణము అనుప్రాసగాగలది.
అంటే "క" వర్ణము తిరిగి తిరిగి ఆవృత్తమైన అది కర్ణాటీ వృత్యనుప్రాసము.
ఉదాహరణకు క్రింది శ్లోకం చూద్దాం.
కాంతే కుటిల మాలోక్య కర్ణకండూయనేన కిమ్
కామం కథయ కల్యాణి కింకర: కరవాణి కిమ్
(సరస్వతీకంఠాభరణము-2-178)
(కాంతా! కుటిలముగా చూచి చెవి గోకుకొనుటచేత ఏమిటి లాభము?
కల్యాణీ! నీ కోరికను చెప్పు. కింకరడనైన నేను ఏమిచేయాలి)
దీనిలో "క" వర్ణము అనేక మార్లు ఆవృత్తమైనది.
దీనిలో హల్లుకే ప్రాధాన్యము
కాని అది ఏస్వరంతో కలిసి అయినా ఉండవచ్చు.
దీనిలో పద్యమంతటా "క" వర్ణం వ్యాపించి ఉన్నందున
ఇది కర్ణాటీ వృత్యనుప్రాసము.
No comments:
Post a Comment