Thursday, May 18, 2017

ఏకపాది


ఏకపాది


సాహితీమిత్రులారా!



ఒక పద్యం లేక శ్లోకంలో అన్ని పాదాలు
ఒకటిగా ఉంటే దాన్ని ఏకపాది అంటారు.
దీనిలోని పదములు ఆవృత్తి అయిన
మహాయమకము అని.,
చతుర్వ్యవసితయమకము 
కూడా అంటారు

భారవి   కిరాతార్జునీయమ్ లోనిది  ఈ  శ్లోకం
ఇందులో అన్ని పాదాలు ఒకేలా ఉన్నాయి.
కావున దీన్ని ఏకపాది అంటాము.
శ్లోకం చూడండి-

వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
                             (కిరాతార్జునీయమ్ - 15- 52)

ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసే అర్జునుని
పరీక్షించ వచ్చిన కిరాతుని రూపంలో ఉన్న
శివునికి అర్జునునికి జరిగే పోరాటంలోని
విషయం తెలిపేదీ శ్లోకం-

అర్జునుని బాణాలు విస్తరిస్తుండగా
శివుని బాణాలు భంగమవుతున్నాయి.
రాక్షసులు చూచి శంకరుని బాణాలు కూడా
వ్యర్థమవుతున్నాయని ఆశ్చర్యం పొందగా,
ఋుషులు దేవతలు ఆకాశంలో చేరి భయంకరమైన
యుద్ధాన్ని చూడటానికి ఒకే చోటికి చేరారు - అని పద్య భావం.

దండి కావ్యాదర్శంలోనిది ఈ శ్లోకం

సమానయాసమానయా
సమానయాసమానయా
స మా న యాసమానయా
సమానయాసమానయా
                        (కావ్యాదర్శము 3-71)

హే అసమ = ఓ సాటిలేని స్నేహితుడా, స = అట్టి నీవు, మా = నన్ను,
సమాన-యాస-మానయా = సమానమైన ఆయాసముయొక్క
 ప్రమాణము కలదియు, సమానయా = మానముతో కూడినదియు,
అసమాన మా = సాటిలేనిదియు అగు, అనయా = ఈ నాయికతో,
సమానయ = కలుపుము. యా = ఏ నాయికతో,
అసమానయా = లక్ష్మీ నయములతో కూడినది కానిది,
న = కాదో, ఆమె లక్ష్మీ - నయములు గల నాయిక అగుటచే
ఉపేక్షింపదగినదికాదు అని భావము.

సరస్వతీకంఠాభరణములోని శ్లోకం-

సభాసమానా సహసాపరాగాత్
సభాసమానా సహసాపరాగాత్
సభాసమానా సహసాపరాగాత్
సభాసమానా సహసాపరాగాత్

కాంతితోడను, గౌరవముతోడను శత్రువిక్షేపముతోడను,
హాసముతోడను, రాగహీనత్వమును తినివేయుచున్నది.
ప్రకాశముతో శోభించుచున్నదై ఉండి మార్గశీర్షముచేత
పరాగకణములను పొందుచున్నది. శత్రువులను
సంహరించువారితో కూడినదై కాంతికి సరూపములైన
వానిని కలిగియున్నది. ఈ విధమైన అసమానమయిన
సభ ఒక కొండ నుండి ఆకస్మికముగా మరొకచోటికి
వెళ్ళిపోయినది - అని భావం.


నాట్యశాస్త్రంలోని ఈ శ్లోకం చూడండి.

వారణానామయమేవకాలో, 
వారణానామయమేవకాల:
వారణానామయమేవకాలో, 
వారణానామయమేవకాల:

(ఇది వారణపుష్పములు వికసించుటకు తగిన కాలము.
ఇది ఏనుగులు విజృంభించుటకు తగిన కాలము.
ఇది శత్రువులకు అనుకూలమైన కాలము.


ఇది యుద్ధములకు అనుకూలమైన కాలము.)

No comments: