రాధగాని రాధ యేది?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం చూడండి-
గజముగానటువంటి గజమేది యగుచుండు?
స్నేహమ్ముగానట్టి స్నేహమేది?
చిలుకగానటువంటి చిలుకేదియగుచుండు?
హారమ్ముగానట్టి హారమేది?
రణముగానటువంటి రణమేదియగుచుండు?
వ్యాఘ్రమ్ముగానట్టి వ్యాఘ్రమేది?
ధనముగానటువంటి ధనమేది యగుచుండు?
దంతమ్ముగానట్టి దంతమేది?
రాగమదిగాని యటువంటిరాగమేది?
రాధగానటువంటి యారాధయేది?
మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!
(శ్రీవేంకటేశ్వర సారస్వత వినోదిని పుట.110)
చూడండి ఆలోచించి
సమాధానం దొరుకునేమో!
1. గజముగాని గజము -
నభోగజము(మేఘము)
2. స్నేహముగాని స్నేహము -
కటుస్నేహము(ఆవాలచెట్టు)
3. చిలుకగాని చిలుక -
సీతాకోకచిలుక
4. హారముగాని హారము -
సంప్రహారము(యుద్ధము)
5. రణముగాని రణము -
కిరణము(కాంతిరేఖ)
6. వ్యాఘ్రముగాని వ్యాఘ్రము -
గృహవ్యాఘ్రము(పిల్లి)
7. ధనముగాని ధనము -
శోధనము(వెదకుట)
8. దంతముగాని దంతము -
అదంతము(కప్ప)
9. రాగముగాని రాగము -
పుష్యరాగము(ఒక రత్నము)
10. రాధగాని రాధ -
అనూరాధ (ఒక నక్షత్రము)
No comments:
Post a Comment