దశరథాధీశుండు పెంపొందగన్
సాహితీమిత్రులారా!
ఈ గూఢచిత్రపద్యం చూడండి-
ఇది భాస్కరరామాయణములోనిది
దశరథుని వర్ణించే పద్యం.
జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుఁడాజింద్రిలో
చనుఁడుద్యచ్చతురంగ సైన్యుఁడును భాస్వద్రూపపంచాస్త్రుఁడ
న్యనృపక్రౌంచషడాననుండు ఘనసప్తాశ్వాన్వయుండష్టమం
త్రి నవద్రవ్యనిధీశుఁడై దశరథాధీశుండు పెంపొందగన్
(భాస్కరరామాయణము - 1- 44)
ఈ ప్రపంచంలో దశరథుడు ఏకైక మహారథుడు.
బ్రాహ్మణ రక్షణలో దక్షుడు, యుద్ధంలో రుద్రుడు,
చతురంగసైన్యాలు కలిగినవాడు. రూపంలో మన్మథుడు,
శత్రువులను చెండాడంలో కార్తికేయుడు,
సూర్యవంశంలో పుట్టినవాడు, చుట్టూ ఎనిమిది మంది
మంత్రులను కలిగినవాడు, నవద్రవ్యాలకు అధిపతియైనవాడు,
దశరథుడు.... అని వర్ణించాడు కవి
కానీ ఇందులో పెద్ద గొప్పదైన ప్రత్యేకమైన
వర్ణన ఏముంది అంటే ఇందులో లేదు
ఇందులో ఒకటి నుండి పది వరకుగల
సంఖ్యలను పద్యంలో గోపనం చేశాడు
కావున ఇది గోపన చిత్రమగుచున్నది.
అవి ఇక్కడ గమనించండి-
జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుఁడాజింద్రిలో
చనుఁడుద్యచ్చతురంగ సైన్యుఁడును భాస్వద్రూపపంచాస్త్రుఁడ
న్యనృపక్రౌంచషడాననుండు ఘనసప్తాశ్వాన్వయుండష్టమం
త్రి నవద్రవ్యనిధీశుఁడై దశరథాధీశుండు పెంపొందగన్
లోకైక = (లోక+ ఏక) = 1
ద్వి = 2, త్రి= 3,
చతురంగ - (చతుః - అంగ) పదంలో - 4
పంచాస్త్ర లో - 5, షడాననలో - 6 , సప్తాశ్వలో - 7,
అష్టమంత్రిలో - 8, నవద్రవ్య లో 9,
దశరథలో 10 ఈ విధంగా కవి గోపనం చేశాడు.
No comments:
Post a Comment