Thursday, December 15, 2016

సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్


సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్



సాహితీమిత్రులారా!


శ్రీ విజయనగర సంస్థానాధీశుడు,
మహాపండిత నిత్యగోష్ఠీనిరంతరుడు,
అయిన శ్రీమదానందగజపతీ సార్వభౌముడు
ఒకరోజు పండితులందరికి ఒక సమస్యనిచ్చి
ఈ మకుటంతో ఒక శతకం వ్రాయవలసినదగా
పండితులందరికీ ఆజ్ఞాపించాడు -
ఆ సమస్య-
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్

దీనికి అనేకమంది తమ ప్రజ్ఞాప్రాభవాలతో శతకాలను వ్రాశారు.
కాని ఈ శతకాలన్నీ భూపతికి చేరి పరిశీలించే లోపే
ఆయన కాలవశమ్మున చిక్కి కీర్తిశేషులైనారు.

అందులో శ్రీవిజయనగరమహారాజావారి
కళాశాలలో సంస్కృత పండితుడు అయిన 
శ్రీభాగవతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు
సత్యవ్రతి శతకాన్ని వ్రాశారు.
కానీ ఇది వ్రాసిన సుమారు 40 సంవత్సరాల
తరువాత 20-03-1929న శ్రీభాగవతుల లింగమూర్తి గారిచే
ముద్రింపించబడెను.

ఇది చిత్రకవితాశతకం దీని విశేషాలు-

ఈ శతకానికి కవిగారే టిప్పణము వ్రాశారు.
ఇందులోని అన్ని పద్యాలు కందపద్యాలే.
ఏకప్రాస శతకం ఇది.
శతకమంతా - కార ప్రాసతో సాగింది.

ఇందులో శతకప్రారంభంలో
రెండు పద్యాలు ఉన్నాయి అవి-
సరస్వతీ, శంకరుల ప్రార్థనలు.

వాణీవీణా విలస
త్పాణీ ఘ్రాణజిత గంధఫలి భారతి బ్ర
హ్మాణీ హరిమధ్యమ క
ల్యాణీ మద్రసన తుదమెలంగుము కరుణన్

కనకహార్యశరాస రాసభవిపక్షాజిహ్మగా జిహ్మగా
వనిపస్ఫారగుణా గుణాకర కరవ్రాతా ధరీపూత పూ
న యాదిత్యముఖగ్రహా గ్రహపతీం ద్వర్చిష్మదుస్రాంచితా
నన నాళీకుసుమా సుమాంబకవపుర్నా శంకరా శంకరా

అని శబ్దాలంకారసమన్వితంగా ప్రార్థించారు శంకరుని.

ఈ శతకం మొత్తం అన్ని పద్యాలు ఏదో ఒక ప్రత్యేకతతో ఉన్నాయి.
83వ పద్యం ఏకాక్షరిగాను
84వ పద్యం సనాళ షోడశదళ పద్మబంధంగా కూర్చారు.
ఇక్కడ ఏకాక్షరి పద్యాన్ని చూద్దాం-

ఋత తిత ఊత్తు త్తీతా
తతేతి తాతేత తాత తత్తై తత్తా
తత తుత్తా తతి తుత్తిన్ 
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్

ఇందులో త - అనే హల్లు ఒకటే
ఉపయోగించి కూర్చబడినది.
మరియు  ఇందులో నాలుగవ పాదము
అన్ని పద్యములకు
మకుటంగా ఉన్నందున
అది ఒకే వ్యంజనము
ఉండనవసరములేదు.

ఋత - సత్యమనెడు, తితఉ - జల్లెడచేతను,
ఇత - పొందబడిన, ఆతత - విస్తారియగు,
ఇతి - జ్ఞానము చేతను, తాత - తండ్రివంటి
పరమేశ్వరుని యొక్క, ఇత - పొందబడిన,
తాత - దయచేతను, తత్తైతత్తా - అది ఇది
అనే భేదభావముచేత కలిగిన, తత - అధికమగు,
తుత్తాతతి - బాధ సమూహమును,
తుత్తిన్ - కొట్టుటచేతను,
సత్యవ్రతికి సంతసమొసగును.

పదార్థశోధనముచే గలిగిన జ్ఞానముచేతను,
ఈశ్వరజ్ఞానము చేతను, సంసార దుఃఖము
తొలగుననియు అందుకు సత్యము మూలమని
తాత్పర్యము.

ఈ విధంగా భాగవతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు
చిత్రకవితా సమన్వితంగా శతకాన్ని రచించారు.



No comments: