Friday, December 23, 2016

కలువలరాజు బావ సతి గన్నకుమారుని...


కలువలరాజు బావ సతి గన్నకుమారుని...




సాహితీమిత్రులారా!



కొందరు సూటిగా మాట్లాడరు వారిధోరణి
ఈ పద్యంలో గమనింపవచ్చు చూడండి-

కలువలరాజు బావ సితి గన్నకుమారుని యన్న మన్మనిన్
దొలచినవాని కార్యములు తూకొనిచేసిన వాని త్ండ్రినిం
జిలికినవాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడి నింటికిఁ జూడవే చెలీ!

ఒకస్త్రీ తన చెలితో పలికిన పద్యం ఇది-

దీని అర్థం గమనించండి-

కలువలరాజు - చంద్రుడు,
ఆతని బావ - విష్ణువు,
విష్ణువు సతి  - లక్ష్మి, 
లక్ష్మి కుమారుడు - మన్మథుడు,
మన్మఖుని అన్న - బ్రహ్మ,
బ్రహ్మ మనుమడు - రావణుడు,
రావణుని చంపినవాడు - రాముడు,
రాముని కార్యములు చేసినవాడు - ఆంజనేయుడు,
ఆంజనేయుని తండ్రి - వాయువు,
వాయువును చిలికినవాడు - శేషుడు,
శేషుని వైరి - గరుడుడు,
గరుడుని పతి - కృష్ణుడు,
కృష్ణుని చెల్లెలు - సుభద్ర, 
సుభద్ర బావ - భీముడు,
భీముని అన్న - ధర్మరాజు,
ధర్మరాజు తండ్రి - యముడు,
యముని వాహనము - దున్నపోతు,
దున్నపోతు వలె  ఇంటికి వస్తున్నతన్ని చూడవే చెలీ
- అని భావం.

No comments: