చవితిన్ షష్ఠజుడేగి పంచమపతిస్థానంబు....
సాహితీమిత్రులారా!
గూఢచిత్రం అనేకానేకాలుగా ఉంటుంది.
ఇందులోని భావం అంతసులువుగా అవగాహనకురాదు
ఎందుకంటే అక్కడున్న పదానికి మామూలుగా
మనం తీసుకునే అర్థంకాక సంకేతాలుగా ప్రతీకలుగా ఇలా
రకరకాలుగా ఉండటం వలన సులభగ్రాహ్యముగా ఉండదు.
ఇక్కడ ఒక పద్యం చూడండి-
చవితిన్ షష్ఠజుడేగి పంచమపతిస్థానంబు లంఘించి, యే
డవ వాడేలిన వీడుజేరి పదిలుండై యష్టమస్యందనో
ద్భవ వీక్షించి, తృతీయు చెంతకు చతుర్థ శ్రేణి నంపించి యా
దివిరోధిన్ బెదిరించి యప్పురి ద్వితీయన్నిల్పి వచ్చె న్వెసన్
ఇందులో ద్వితీయ,తృతీయ,చతుర్థ,
చవితి, పంచమపతి, ఏడవవాడేలిన,
అష్టమస్యందనేద్భవ ఇలాంటి పదాలకు
అర్థం అంతసులువుగా కనిపించవు.
దీనిలే ఉన్న సంఖ్యలకు అష్టదిక్పాలకుల
సంఖ్యలను జోడిస్తే అర్థం దొరుకుతుంది.
ఆది - తూర్పు
దిక్పాలకుడు(ఇంద్రుడు)
ద్వితీయము - ఆగ్నేయము -
ఆగ్నేయదిక్పాలకుడు (అగ్ని)
తృతీయము - దక్షిణము -
దక్షిణదిక్పాలకుడు (యముడు)
చతుర్థము - నైరుతు -
నైరుతి దిక్పాకుడు (నిఋతి) రాక్షసుడు
పంచమము - పడమర -
పశ్చిమదిక్పాలకుడు (వరుణుడు)
షష్ఠమము - వాయవ్యము -
వాయవ్యాధిపతి (వాయువు)
సప్తమము - ఉత్తరము -
ఏడవదిక్కు పాలకుడు (కుబేరుడు)
అష్టమము - ఈశాన్యము -
ఈశాన్యాధిపతి (ఈశ్వరుడు)
ఇప్పుడు అర్థం చూద్దాం-
చవితిన్ - నైరుతిదిక్కున,
షష్ఠజుడు - ఆరవదిక్కాలకుని కుమారుడు-
వాయునందనుడు - హనుమంతుడు,
ఏగి - వెళ్ళి,
పంచమపతిస్థానంబు - ఐదవదిక్కు(పడమర)అధిపతి
వరుణునిస్థానం - సముద్రం
లంఘించి - దాటి,
ఏడవవాడేలిన వీడుజేరి - కుబేరుడుపాలించిన లంకకు చేరి
అష్టమస్యందనోద్భవి - 8వ దిక్పాలకుడైన శివుని
రథానికి(భూమికి)పుట్టునది - సీత చూచి,
చతుర్థశ్రేణినిన్ - రాక్షససమూహాన్ని,
తృతీయుని చెంతకు- యముని వద్దకు పంపి,
ఆదివిరోధిన్ - తూర్పుదిక్పాలకుడైన
ఇంద్రుని విరోధి- రావణాసురుని,
బెదిరించి, అప్పురి ద్వితీయన్నిల్పి - ఆ లంకా పట్టణంలో అగ్నిని పెట్టి,
వెసన్ - శీఘ్రంగా, వచ్చె - వచ్చినాడు - అని భావం
No comments:
Post a Comment