కానక గన్న సంతానంబు
సాహితీమిత్రులారా!
అయ్యలరాజు రామభద్రుని
రామాభ్యుదయములోని ఈ పద్యం చూడండి-
ఇది రాముడు అరణ్యమునకు పోవు సందర్భములో
దశరథడు బాధతో పలికిన పలుకులు ఎంత చమత్కారంగా
శ్లేషతో చెప్పబడినవో గమనింపుడు.
కానక గన్న సంతానంబు గావున
గానక గన్న సంతానమాయె
నరయ గోత్ర నిధానమై తోచుగావున
నరయ గోత్ర నిధానమయ్యె నేడు
ద్విజకులాదరణ వర్ధిష్ణుడు గావున
ద్విజ కులాదరణ వర్ధిష్ణుఁడయ్యె
వివిధాగమాంత సంవేద్యుండు గావిన
వివిధాగమాంత సంవేద్యుఁడయ్యెఁ
గటగటా దాశరథి సముత్కట కరీంద్ర
కట కలిత దాన ధారార్ధ్ర కటక మార్గ
గామి, యెటు సంచరించు, నుత్కట కరీంద్ర
కటకలిత దాన ధారార్ధ్ర కటకతటుల
(రామాభ్యుదయము -5-12)
ఈ పద్యంలో ముందు భాగం తరువాతి భాగం
ఒకలానే కనిపిస్తూ అర్థభేదంకలిగి ఉన్నాయి.
1. కానక గన్న సంతానంబు - కలుగక కలిగిన సంతానము,
అడవికొరకే కన్నసంతానము.
2. గోత్రనిధానము - వంశమునకు మూలమైనది,
కొండలు నివాసముగా గలది
3. ద్విజకులాదరణ వర్ధిష్ణుడు - బ్రాహ్మణ కుమును పోషించువాడు,
పక్షిసముదాయమును పోషించువాడు.
4. వివిధాగ మాంత సంవేద్యుఁడు - బహువిధ వేదాంతములవలన తెలిసుకొనదగినవాడు,
బహువిధ వృక్షములనడుమ తెలిసుకొన దగినవాడు
5. సముత్కట కరీంద్ర .... కటక మార్గ
ఏనుగుల మదజలముచే తడిసిన పురములకేగువాడు,
ఏనుగుల మదజలముచే తడిసిన కొండవాలులుగల త్రోవలందు సంచరించువాడు
ఈ విధంగా రెండర్థములను ఆలోచిస్తూ దు:ఖిస్తున్నాడు దశరథుడు.
No comments:
Post a Comment