Sunday, October 2, 2016

జ్యేష్ఠుఁడుగాని జ్యేష్ఠుఁడెవరు?


జ్యేష్ఠుఁడుగాని జ్యేష్ఠుఁడెవరు?


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యం చూడండి
సమాధానాలు చెప్పగలరేమో ఆలోచించండి

రసముగానటువంటి రసమేదియగుచుండు?
కంఠమ్ముగానట్టి కంఠమేది?
మణిగానియటువంటి మణియెవ్వఁడగుచుండు?
చంద్రుండుగానట్టి చంద్రుఁడెవఁడు?
గజముగానటువంటి గజమేది యగుచుండు?
రత్నమ్ముగానట్టి రత్నమెవఁడు?
రథముగానటువంటి రథమేదియగుచుండు?
దేశమ్ముగానట్టి దేశమేది?
వాడగానటువంటి యావాడయేది?
జ్యేష్ఠుఁడేగాని యటువంటిజ్యేష్ఠుఁడెవఁడు?
మెప్పుగానుత్తరమ్ములు చెప్పవలయు
దేవ! శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

మరి ఆలోచించారా సమాధానాలు చెప్పడానికి

1. రసముకాని రసము - ఘనరసము(నీరు)
2. కంఠము కాని కంఠము - క్షీరకంఠము (బిడ్డ)
3. మణికాని మణి - రాత్రిమణి (చంద్రుడు)
4. చంద్రుడు కాని చంద్రుడు - హరిశ్చంద్రుడు(ఒక చక్రవర్తి)
5. గజము కాని గజము - అంబుగజము (మొసలి)
6. రత్నము కాని రత్నము - దినరత్నము (సూర్యుడు)
7. రథము కాని రథము - బ్రహ్మరథము (హంస)
8. దేశము కాని దేశము - అతిదేశము (బదులు)
9. వాడ కాని వాడ - గుడివాడ(బెజవాడ)(ఒక ఊరు)
10. జ్యేష్ఠుడు కాని జ్యేష్ఠుడు - సురజ్యేష్ఠుడు (బ్రహ్మ)

No comments: