రాజీవ రాజీవశలోల భృంగం
సాహితీమిత్రులారా!
యమకాలంకారము అంటే విభిన్నమైన
అర్థం కలిగి ఒకేవిధమైన రూపంగల వర్ణసమూహం.
వర్ణసమూహం యొక్క ఆవృత్తి అవ్యపేత(వ్యవధానంలేకుండా),
వ్యపేతము(వ్యవధానముతోటి) అయిన యమకము అని పిలువబడును.
ఇది అనేకరకములు అందులో
అవ్యపేత యమకమునకు ఉదాహరణ-
రాజీవ రాజీవశలోల భృంగం
ముష్ణంత ముష్ణం తతిభి స్తరూణామ్
కాంతాలకాంతా లలనా: సురాణాం
రక్షోభి రక్షోభిత ముద్వహన్తమ్
(మాఘ శిశుపాలవధ)
శిశుపాలవధలో రైవతకాద్రి వర్ణన సందర్భంలోనిది ఈ శ్లోకం
(రాజీవముల సమూహమునకు వశమై చలించుచున్న
తుమ్మెదలను గలది వృక్షముల సమూహములచేత
ఎండవేడిమిని హరించుచున్నది అందమైన
ముంగురులుగల దేవతాస్త్రీలను రాక్షసులచేత
క్షోభనొందకుండా భరించుచున్నది.)
అవ్యపేత అంటే వ్యవధానంలేకుండా వర్ణసమూహము
ఆవృత్తమైన అది అవ్యపేత యమకము అంటాము.
ఈ యమకము నాలుగు పాదాలలో ఉంటే
చతుష్పాదయమకము అని,
ప్రతిపాదము మొదటిలో ఉన్న
ఆదియమకము అని చెప్పబడుతుంది.
1. మొదటి పాదంలో రాజీవ - (పద్మము), రాజీ - (సమూహము).
2. రెండవపాదంలో ముష్ణంత, ముష్ణం
3. మూడవపాదంలో కాంతాలకాంతాల - కాంత+ అలక + అంతా(:) + ల అనునవి
4. నాలుగవ పాదంలో రక్షోభి: + అక్షోభి(త) అనునవి అవ్యవహితంగా ఆవృత్తి చెందాయి.
No comments:
Post a Comment