Tuesday, October 25, 2016

వెడవెడ చిడిముడి తడఁబడ


వెడవెడ చిడిముడి తడఁబడ



సాహితీమిత్రులారా!


భాగవతంలో సర్వలఘువులతో
కూర్చిన కందాలు రెండు అవి
ఒకటి గజేంద్రమోక్షణంలోను
రెండవది వామనుడు
బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళుసమయంలో
వామనచరిత్రలో అవి రెండు ఇక్కడ -

అడిగెద నని కడువడిఁజను
నడిగినఁ దను మగుడ నుడుగఁడని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడు గిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
                          (8-103)
గజేంద్రుని రక్షించేందు వెళ్ళే సమయంలో
 లక్ష్మీదేవి కొంగు పట్టుకొని వేగంగా
ఆర్తరక్షకు వెళుతున్న విష్ణువును
 అనుసరిస్తూ లక్ష్మీదేవి మనోభావన ఈ పద్యం.

భర్త ఎక్కడికి వెళుతున్నడో ఎందుకు వెళుతున్నాడో
అడగాలని ముందుకు వెళుతుంది అడిగితే
మారుమాటాడకుండా వెనుకకు పొమ్మంటాడని
నడక మానేది. చీకాకుతో తొట్రుపాటుతో మళ్ళీ మెల్లగా
ముందుకు అడుగులు పెట్టేది. మళ్ళీ ఆగేది.
అడుగులు కదలించక లేక తడబడుతూ నడిచేది - అని భావం.

మరో పద్యం -

వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడఁగా 
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడఁగ వడుగు సేరెన్ రాజున్
                                           (8-541)
వామనుడు మెల్లమెల్లగా అడుగులు పెట్టి నడిచాడు.
అక్కడక్కడా భూమి క్రుంగి పోతుంటే సరిగా అడుగులు పెట్టలేక కష్టడినాడు.
నడునడు కొద్దికొద్దిగా మాట్లాడుతూ తడబడుతూ కలవరపడుతూ
బలిచక్రవర్తిని సమీపించాడు - అని బావం.

ఈ రెంటిలోను మొదటి దానిలో పూర్తిగా సర్వలఘువులున్నాయి.
కాని రెండవదానిలో 'సేరెన్ రాజున్' అనే దానితో మూడు గురువులు చేరాయి.

No comments: