రవి కాననిచో కవిగాంచునే గదా!
సాహితీమిత్రులారా!
కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలకు ఇచ్చిన సమస్య
రవి కాననిచో కవిగాంచునే గదా
భట్టుమూర్తి పూరణ-
ఆ రవి వీరభద్రు చరణాహతిడుల్లిన బోసి నోటికిన్
నేరడు రామలింగకవి నేరిచెబో మన ముక్కు తిమ్మన
క్రూరపదాహతిన్ దెగిన కొక్కెర పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియించె నౌర! రవి కాననిచో కవి గాంచునే గదా!
దక్షయజ్ఞంలో పూష- అనే సూర్యుని వీరభద్రుడు
దంతాలుడేట్లు కొట్టాడు. అదే విధంగా రామలింగకవికి
తిమ్మనగారు దంతమూడేవిధంగా క్రూరమైన తనపాదంతో తన్నాడు
దానితో తెనాలి రామలింగకవికి దుప్పికొమ్ము పన్నైనదని,
రవి చూడకపోయినా కవి చూడగలడని పూరణలోని భావం.
ఇదే సమస్యకు మన
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పూరణ-
దీనిలో మరో చమత్కారం చోటు చేసికొంది గమనించండి.
పట్టణ మేగె నొక్క కవి పండుగకున్ కవి భార్య స్నానమై
కట్టెను పట్టుచీర - రవికన్ ధరియించుచునుండ తల్పులన్
నెట్టె కవీంద్రు డా రవికనే కవి కన్ను గప్పె కాంత ఔ
నట్టుల మోమునందు రవికా ననిచో కవి కాంచునే గదా!
ఇందులో కవి చమత్కారం చూడండి
రవికాననిచో - అనే దాన్ని విరిచి ప్రయోగించాడు
రవిక + ఆననిచో అని చమత్కారంగా విరిచాడు.
మీరు కూడ సరిక్రొత్త ప్రయోగంతో
సమస్యను పూరించి పంపించగలరు.
No comments:
Post a Comment