కావ్యకరణే సేనాగణే భాషణే......
సాహితీమిత్రులారా!చర్లవెంకటశాస్త్రి
విచిత్రరామాయణంలోని శ్లోకం ఇది.
విశ్వామిత్రమహర్షి దశరథమహారాజుని
స్తుతిస్తున్న సందర్భంలోనిది.
త్వాముర్వీవరవర్య కావ్యకరణే సేనాగణే భాషణే
త్రాణే వ్యారకణే రణే వితరణే విశ్వంభరాధారణే
సత్యం సత్యవతీభయే శరభయే వాణీశయే విష్ణయే
దాక్షీకుక్షిభయే పృథోదరభయే కల్పద్రయే మేరయే
ఓ రాజా! నీవిషయంలో కావ్యరచనలో, సేనాసమూహ
విషయంలో, భాషణంలో, రక్షించటంలో, వ్యాకరణంలో,
యుద్ధంలో, దానగుణంలో, భూమిని భరించటంలో,
నేను క్రమంగా వ్యాసునివలె, కుమారస్యామివలె, బ్రహ్మవలె,
విష్ణువువలె, పాణినివలె, అర్జునివలె, కల్పవృక్షంవలె,
మేరుపర్వతంవలె, భావిస్తున్నాను- అని భావం
ఇందులో మొదట 8విషయాలను చెప్పి
తరువాత వాటిని అన్వయించాడు.
ఈ విధంగా తీసుకోవాలి-
ఓ దశరథమహారాజా!
కావ్యకరణం(కావ్యరచన)లో - వ్యాసునివలె,
సేనాసమూహ విషయంలో - కుమారస్వామివలె,
భాషణం(మాట్లాడటం)లో - బ్రహ్మ(వాణీశుని)వలె,
రక్షించటంలో - విష్ణువువలె,
వ్యాకరణంలో - పాణినివలె,
యుద్ధంలో - అర్జునునివలె,
దానగుణంలో - కల్పవృక్షంవలె,
భూమిని భరించటంలో - మేరుపర్వతంవలె
నేను నిన్ను భావిస్తున్నాను.
సత్యవత్యాం భవతీతి సత్యవతీభూ: వ్యాస:,
సత్యవతీ భూరి ఇవ అచరామి సత్యవతీభయే.
ఆచారార్థంలో 'ణిచ్' ప్రత్యయం వచ్చిన
నామధాతురూపము ఇది.
ఇదే విధంగా
శరభూ: - కుమారస్వామి, శరభూరి వ అచరామి - శరభయే,
వాణీశ: ఇవా చరామి వాణిశయే,
మేరు రివాచ రామి మేరయే -
ఈ విధంగా గ్రహించాలి.
దీనిలోని విష్ణయే, మేరయే, కల్పద్రయే - అనేవి
అపశబ్దాలుగా భ్రాంతిని కలిగిస్తాయి -
కాని వ్యాకరణం తెలిసినవారు
దీనిలోని చమత్కారం సులభంగా తెలుసుకోగలరు.
No comments:
Post a Comment