Tuesday, October 11, 2016

సా మమారిధమనీ నిధానినీ


సా మమారిధమనీ నిధానినీ



సాహితీమిత్రులారా!


సంగీతంలో స,రి,గ,మ,ప,ద,ని -
అని 7 స్వరాక్షరాలున్నాయి కదా!
సంగీతంలో వాటికి రాగానుకూలంగా
ఈ అక్షరాలను దీర్ఘాలుగా, హ్రస్వాలుగా
కూడా వాడుతారు సంగీతం తెలిసిన వారికి
దానిలోని ఆనందం అర్థమౌతుంది.
కాని ఈ అక్షరాలను ఉపయోగించి
సరస్వతీ కంఠాభరణంలో ఒక శ్లోకం ఉంది



సా మమారిధమనీ నిధానినీ
సామధామ ధనిధామ సాధినీ
మానినీ సగరిమా పపాపపా
సాపగా సమసమాగమాసమా
                                        (సరస్వతీకంఠాభరణమ్- 4-265)

నదీతుల్యమైన క్షణిక సమాగమాగమము కలదియు,
సాటిలేనిదియు, నవనిధులను కలుగజేయునదియు,
కాంతికి నెలవైనదియు, ధనికులకు
తేజస్సును సంతరించునదియు, అర్చనయోగ్యయు,
గౌరవవంతురాలును, పాపరహితులను పాలించునదియు
నైన లక్ష్మిదేవి నాకు అరిధమని(శత్రుసంహారిణి)యగుగాక!
- అని భావం.


(సా = స + అ;  విష్ణువుతో కూడినది  - లక్ష్మిదేవి)


అలాగే ఈ స్వరాలను ఉపయోగించి పద్యం
వ్రాశాడొకకవి చూడండి ఆ పద్యం -

మా పని మీ పని గాదా
పాపమ మా పాపగారి పని నీ పనిగా
నీ పని దాపని పనిగద
పాపని పని మాని దాని పని గానిమ్మా

పైశ్లోకమునందు పద్యమునందు
సప్తస్వాలను మాత్రమే
ఉపయోగించి వ్రాయటం విశేషం..

No comments: