అయ్యనుజూచి యామె విరహాతురయయ్యె
సాహితీమిత్రులారా!
సమస్య -
అయ్యనుజూచి యామె విరహాతురయయ్యెను సాజమేకదా!
ఈ సమస్య 21-01-1977న మచిలీపట్టణం అష్టావధానంలో
సి.వి.సుబ్బన్నగారికి ఇవ్వగా ఆయన ఈ విధంగా పూరించారు.
నెయ్యపుఁదొయ్యలిన్ వదలి నీరధియానమొనర్చఁబోయి రాఁ
డయ్యెఁబ్రియుండు వచ్చుటది యప్పుడొయిప్పుడొయంచుజూడఁగా
నయ్యుపలాలితోక్తులు ద్విజాగ్రణియొక్కఁడు తెల్పె దూతయౌ
నయ్యనుజూచి యామె విరహాతురయయ్యెను సాజమేకదా!
అయ్య - తండ్రి, పూజ్యుడు.
అటువంటివానిని చూచినంతనే
విహాతుర కావడం సాజమా కాదుకదా!
దీన్ని "దూతయౌనయ్యను జూచి" అనడంతో
మొత్తం అర్థం రమణీయంగా మారింది.
ప్రియుడు సముద్రప్రయాణం చేసి ఎన్నాళ్ళకూ రాలేదు.
అతని కొరకు ఆ నెయ్యపుటాలు నిరీక్షించుచున్నది.
అతడు తన కుశలవార్త ఒక బ్రాహ్మణోత్తమునితో చెప్పిపంపినాడు.
దూతయై వచ్చిన అయ్య(పూజ్యుడు) వినిపించిన బజ్జగింపుమాటలు
ఆమెకు ప్రాణం పోసినవి. అయ్యను చూచినంతనే పతిని గురించిన
తియ్యని తలపులు ఆమెలో వలపురేపినవి.
అందుచేత విరహాతుర అయ్యింది.
ఈ సమస్యను మీరు మీదైన శైలిలో పూరించి పంపండి.
No comments:
Post a Comment