Monday, October 10, 2016

శరము నాభికనున్న శతవృద్ధు సారథి


శరము నాభికనున్న శతవృద్ధు సారథి


సాహితీమిత్రులారా!


ముక్తపదగ్రస్తంలో శివస్తుతి అందులోను
త్రిపురాసుర వృత్తాంతమైనదీ పద్యం
చూడండి-

సర్వసర్వం సహాసముద యంబు రథంబు
          రథమధ్యమున నున్న రాయి విల్లు
విల్లువెంబడిఁదిర్గు వెలుఁగులు చక్రాలు
          చక్రాలకు వైరి చారు నారి
నారిఁబట్టుక తిర్గు నాగరకుఁడు గఱి
          గఱి మీఁద విహరించు ఘనుఁడు శరము
శరము నాభికనున్న శతవృద్ధు సారథి
          సారథి మాయలు సైంధవములు
గాఁగ నేగుదెంచి కణఁకణతోఁబురములు
గెలచినట్టి ఘనుఁడు గిరిజ తోడఁ
గలసియుండునట్టి కరుణా సముద్రుండు
నిష్ట సిద్ధులొసఁగు నెలమి మనకు

ఇందులో సీసపద్యం మాత్రం
ముక్తపదగ్రస్తాలంకారంలో ఉంది.

సర్వసర్వం సహాసముదయంబు రథంబు - భూమి,
రథమధ్యమున నున్న రాయి విల్లు -
భూమి మధ్యనగల మేరుపర్వతం విల్లు,
విల్లువెంబడిఁదిర్గు వెలుఁగులు -
మేరుపర్వంతం చుట్టుతిరుగు
సూర్యచంద్రులు, చక్రాలు,
చక్రాలకు వైరి - (సూర్యచంద్రులకు వైరి
 -రాహుకేతులు)- సర్పము,
చారు నారి - చక్కనైన అల్లెత్రాడు,
నారిఁబట్టుక(పామును) తిర్గు నాగరకుడు -
గరుత్మంతుడు, గఱి- ఈక,
గఱిమీఁద(గరుత్మంతునిమీద) విహరించు ఘనుడు
 - విష్ణువు, శరము - బాణము,
శరమునాభికనున్న(విష్ణువు నాభిలో ఉన్న)
శతవృద్ధు - బ్రహ్మ,
సారథి - రధాన్ని నడుపువాడు,
సారథి(బ్రహ్మ)మాటలు - వేదాలు,
సైంధవములు - గుఱ్ఱాలుగ -
త్రిపురాసుర సంహారం చేసిన శివుడు
పార్వతితోడ కలిసి ఉండే కరుణాసముద్రుడు
ఈప్సితార్థాన్ని మనకు ఇచ్చుగాక- అని ప్రార్థన


No comments: