స్తనవతీ నవతీర్థ తను స్తను:
సాహితీమిత్రులారా!
యమకాలంకారమున అవ్యపేత
యమకమునందు వివిధములైన
వాటిని తెలుసుకొనుచున్నాముకదా
ఇపుడు మధ్యాంతయమకం తెలుసుకుందాం.
అవ్యపేత చతుష్పాదయమకమునందు
పాదమధ్యమునందు, పాదాంతమునందు
రెండు చోట్ల యమకము వచ్చుటను
మధ్యాంత యమకం అనేపేరుతో పిలుస్తున్నాము.
దానికి ఉదాహరణ-
ఉదయితే దయితే జఘనం ఘనం
స్తనవతీ నవతీర్థ తను స్తను:
సుమనసా మనసా సదృశౌ దృశౌ
ద్యుకురు మే కురు మేऽభిముఖం ముఖమ్
(సరస్వతీకంఠాభరణమ్ - 4-97)
ఓ ప్రియురాలా అభ్యుదయసంపన్నమయిన
నీ జఘనము ఘనము, నీ తనువు స్తనవతీ
నవతీర్థముల చేత పలుచబడినది.
నీ చూపులు పువ్వుతోను మనస్సుతోను సాటియైనవి.
స్వర్లోక భూలోక సౌంద్యావధీ నీముఖమును నాకు
అభిముఖము గావింపుము - అని భావం.
ఉదయితే దయితే జఘనం ఘనం
స్తనవతీ నవతీర్థ తను స్తను:
సుమనసా మనసా సదృశౌ దృశౌ
ద్యుకురు మే కురు మేऽభిముఖం ముఖమ్
ఇందులో ప్రతిపాదంలో మూడు వర్ణములు మధ్యలోను,
రెండు వర్ణములు చివరలోను ఆవృత్తమైనవి.
మొదటిపాదం మొదట దయితే, చివర ఘనం,
రెండవపాదం మొదట నవతీ. చివర తను:,
మూడవ పాదం మొదట మనసా, చివర దృశౌ,
నాలుగవపాదం మొదట కురుమే, చివర ముఖం
అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి
వర్ణములలోనే ఏకత్వం కాని అర్థంలో ఏకత్వం లేదు.
కావున ఇది అవ్యపేత చతుష్పాదయమకంలో మధ్యాంత
యమకమునకు ఉదాహరణగా సరిపోవుచున్నది.
No comments:
Post a Comment