Tuesday, August 9, 2016

బ్రహ్మ పూజార్హుడు కాడా?


బ్రహ్మ పూజార్హుడు కాడా?


సాహితీమిత్రులారా!

పురాణాలలో మనం వింటున్నకథ.
బ్రహ్మ, విష్ణువు నేను గొప్ప అంటే నేను అని పోట్లాడుకొంటుండగా
వారిమధ్య ఒక మహాతేజోలింగ ఏర్పడింది.
దానికి - వారిలో ఎవరు ఆది - అంతము ఏదైనా ఒకటి కనుగొంటారో
వారు గొప్పవారని ఆకాశవాణి చెప్పడంతో
బ్రహ్మ అంతం కనుక్కోడాని వెళతాడు
విష్ణువు ఆదిని కనుక్కోడానికి వెళతాడు.
చివరికి బ్రహ్మదేవుడు తను అంతం చూశానని
దానికి కేతకి పుష్పం(మొగలిపూవు), గోవును కూటసాక్ష్యానికి వాడుకుంటాడు.
అప్పుడు మహాతేజోలింగం నుండి బ్రహ్మ అసత్యం చెప్పడం వల్ల
పూజార్హత లేకుండా శాపం పెట్టబడినట్లు,
అలాగే కేతకి పుష్పం పూజకు పనికిరాకుండాను,
ఆవు బ్రహ్మ అంతంచూశాడని తలతో, చూడలేదని తోకతో చెప్పడం వలన
గోవు ముఖము పూజార్హంకాక, తోకకు పూజార్హత కలిగించినట్లు చెప్పబడింది.


ఈ కథలోని గూఢవిషయాలను ప్రతీకగూఢం అంటాము.
దీనిలోని విషయాలను శ్రీ గన్ను కృష్ణమూర్తిగారు
తన ఋషిహృదయం పుస్తకం
ముందుమాటలో వివరించారు
ఆ విషయాలను ఇక్కడ చూద్దాం.

ఇందులో
మహాతేజోలింగం - మహావిశ్వానికి ప్రతీక
విష్ణువు - సూర్యునికి ప్రతీక
బ్రహ్మ - చంద్రునికి ప్రతీక. చంద్రుణ్ణి పూజించరుకదా!
ఎందుకంటే చంద్రునికి స్వయంప్రకాశకత లేదు.
అదేకాక చంద్రునికి శాపాలున్నాయని, చంద్రుడు నపుంసకుడని
అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
గోమాత - భూమికి ప్రతీక. గోవుకు ముందు కొమ్ములు ఉన్నాయికదా!
అది పొడిచే అవకాశం ఉంది అందుకే తోకవైపు నమస్కరించమన్నారు పెద్దలు..
కేతకి పుష్పం - నక్షత్రానికి ప్రతీక. నక్షత్రాలను పూజించరు
కేవలం నమస్కారం పెట్టుకొని ఊరుకుంటారు.

ఇదండి గన్ను కృష్ణమూర్తిగారి వివరణ.
ఇందులోని విషయం ఒక ప్రహేళికగాను,
ఒక ప్రతీకగూఢంగాను తీసుకోవచ్చు.

No comments: