నీటికెల్లకాలమ్మును నిలయమేది?
సాహితీమిత్రులారా!
పొడుపు పద్యాలను చాల చూశాము.
ఇపుడు మరో పొడుపు పద్యం చూడండి.
కడువిశాలమగు ముఖంబు కల్గినదేది?
బహుకాలజీవియౌ పక్షియేది?
గృహమున వ్యాఘ్రమై విహరించునదియేది?
యూరిసింగంబయి యొప్పునేది?
పెక్కుమారులు నీరు పీల్చెడి మృగమేది?
జింకలను భ్రమింపఁజేయునేది?
కరము వేగముగల్గి పరుగుదీయునదేది?
కన్నులే చెవులుగాఁగలదియేది?
తనదు కడుపున మణికోటిఁదాల్చునేది?
నీటికెల్లకాలమ్మును నిలయమేది?
స్వామి! వ్యుత్పత్తితోడి జవాబులేవి?
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!
(శ్రీ వేంకటేశ సారస్వత వినోదిని - 34)
దీనిలో షరతులు పెద్దగా ఏమీలేవు.
ఉన్నది ఒకటే అది వ్యుత్పత్తితో జవాబు చెప్పాలి.
చూడండిమరి............
కడువిశాలమగు ముఖంబు కల్గినదేది? - పంచాస్యము(సింహము)
బహుకాలజీవియౌ పక్షియేది? - చిరజీవి (కాకి)
గృహమున వ్యాఘ్రమై విహరించునదియేది? - ఇంటిపులి (పిల్లి)
యూరిసింగంబయి యొప్పునేది? - గ్రామసింహం (కుక్క)
పెక్కుమారులు నీరు పీల్చెడి మృగమేది? - అనేకపము(ఏనుగు)
జింకలను భ్రమింపఁజేయునేది? - మృగతృష్ణ (ఎండమావులు)
కరము వేగముగల్గి పరుగుదీయునదేది? - తురగము(గుఱ్ఱము)
కన్నులే చెవులుగాఁగలదియేది? - వీనులకంటి(పాము)
తనదు కడుపున మణికోటిఁదాల్చునేది? - రత్నగర్భ (భూమి)
నీటికెల్లకాలమ్మును నిలయమేది? - జలధి (సముద్రము)
No comments:
Post a Comment