Tuesday, August 23, 2016

హరి కమ లాబ్జ చక్ర నివహంబు


హరి కమ లాబ్జ చక్ర నివహంబు


సాహితీమిత్రులారా!

అయ్యలరాజు నారాయణామాత్యకవి 
రచిత హంసవింశతిలోని
ఈ పద్యం చూడండి.

తరుణులకౌను లాకృతులు తళ్కు మొగంబులు చన్గవల్ సువా
క్సరణులు పాణులున్ మెడలు సారనితంబమహోన్నత తత్వముల్
దరళవిలోసనంబులు పదంబులు నెన్నొసలున్ ముణుంగులున్ 
హరి కమ లాబ్జ చక్ర నివహంబునయంబు రయంబున న్నగున్
                                                                                 (హంసవింశతి 5-276)


ఈ పద్యం మొదటి మూడు పాదాలలో
ఉపమేయాలను చివరిపాదంలో
ఉపమానాలను  చెప్పినాడుకవి.
ఉపమానాలను చూడండి-
హరి (నానార్థాలు)- 1. సింహము 2. చిలుక 3. జింక
కమలాబ్జ - కమలా + అబ్జ, కమల + అబ్జ - అని విరిచి అర్థం తీసుకోవాలి.
కమలా - లక్ష్మిదేవి, కమల - పద్మము
అబ్జ (నానార్థాలు) - 1.చంద్రుడు 2.శంఖము
చక్ర (నానార్థాలు) - 1. భూచక్రము 2. చక్రవాకపక్షి 3. పాముచుట్ట

1. ఈ తరుణుల నడుములు(కౌనులు) సింహము(హరి)ని
    ఆకృతులు లక్ష్మిదేవిని(కమలను), మొగములు చంద్రుని(అబ్జ)ని
     చన్గవలు చక్రవాకపక్షులను పరిహాసము చేయును.
2. ఈ కాంతల మాటలు(వాక్సరణులు) చిల్కలను(హరిని),
    చేతులు(పాణులు) కమలములను,
    మెడలు  శంఖము(అబ్జ)లను, నితంబములు(పిఱుదులు)
     గుండ్రనిభూభాగము(చక్ర)లను గేలిచేయును.
3. ఆ తరళ చంచలములైన కన్నులు జింక(హరి)లను,
     పాదములు కమలములను, నెన్నొసలు చంద్రుని(అబ్జ)ని,
      జడచుట్టలు (ముణుంగులు) పాముచుట్టల(చక్రనివహంబు)ను
     గేలిచేయును.
     క్లిష్టమైన దీన్ని గూఢచిత్రంగా చెప్పవచ్చు.

No comments: