కుచఫలమది చిల్క గుమినిజేర్చు
సాహితీమిత్రులారా!
ఈ పొడుపుపద్యం పొడవండి.
శ్రీ ఫలముండును శివమందిరమునందు
సంద్రమందు దొరుకు బిందుఫలము
గ్రాహి ఫలములోవఁ గవులు గంతులువేయు
త్రయినేత్రమగును శిర: ఫలమ్ము
గుచ్ఛఫలము నుర్గునిచ్చు కాయల నిచ్చు
కాకఫలము చేఁదు కాయల నిడు
జంతుఫలము హోమ సమిధల నొనఁగూర్చుఁ
గుచఫలమది చిల్క గుమినిజేర్చు
యవఫలము పండియెండు నీ భువనమందు
గూఢ ఫలమిఁక ముండ్లతోఁగూడి యుండు
ఫలములకు నర్థములు చెప్పవలయుదేవ
దేవ శ్రీవేంకటేశ పద్మావతీశ
(శ్రీవేంకటేశ సారస్వత వినోదిని పుట. 199)
మిత్రులారా! ఇందులోని ఫలములకు అర్థం చెప్పడమే
ఇందులోని విడుపు
ఆలోచించండి.
1. శ్రీ ఫలము - శ్రీఫలములను ఇచ్చేది మారేడుచెట్టు
2. బిందుఫలము - నీటిబిందువు వంటి ముత్యము
3. గ్రాహిఫలము - అజీర్ణ ఫలములనిచ్చేది వెలగచెట్టు
4. శిర: ఫలము - తలవంటి కాయలను ఇచ్చేది కొబ్బరిచెట్టు
5. గుచ్ఛఫలము - గుత్తులుగా కాయలు కాసేది
(నురుగు కాయలనిచ్చేది) కుంకుడుచెట్టు
6. కాకఫలము - కాకప్రియ ఫలములనిచ్చేది వేపచెట్టు
7. జంతుఫలము - క్రిమి గర్భఫలములనిచ్చేది అత్తిచెట్టు
8. కుచఫలము - కుచరూప ఫలములను ఇచ్చేది దానిమ్మచెట్టు
9. యవఫలము - బార్లివంటి ధాన్యమునిచ్చేది వెదురుగుమి
10. గూఢఫలము - ముండ్ల మరుగున పండ్లుబండేది రేగుచెట్టు
No comments:
Post a Comment