Wednesday, August 3, 2016

సారసాకర మచటి కాసారచయము


సారసాకర మచటి కాసారచయము


సాహితీమిత్రులారా!

చెళ్ళపిళ్ళ నరసకవి 
వేంకటేశ్వర విలాసములోని
కాసారవర్ణన చూడండి.
ముక్తపదగ్రస్త అలంకారంతో
ఎంత మనోహరంగా ఉందో.

భావభవకేతనార్హరాజీవజీవ
జీవనాలంకృతైకరాజీవజాల
జాలకామోదపూర్ణప్రసాదసార
సారసాకర మచటి కాసారచయము
  (వేంకటేశ్వరవిలాసము -1-18)

భావభవుడు - మనసులో పుట్టేవాడు మన్మథుడు,
 అతనిజెండామీది గుర్తు చేప
అందుకే్ ఆయన మీనకేతుడు,
అతని కేతనంమీద ఉండటానికి అర్హమైన మంచిమంచి
చేపలు (రాజీవ) ఉన్నాయి ఆ సరస్సులో.
ఆ చేపలకు జీవం నిలబెట్టే నీరూ(జీవన) పుష్కలంగా ఉంది.
నిండా జీవనంతో అలంకృతమై ఉత్పల సమూహాలూ(రాజీవ - జాల)
ఇంకా విచ్చుకోని తామరమొగ్గలూ(జాలక)
వీటి పరిమళాలతో(ఆమోద)నిండిపోయింది.
ఆమోదపూర్ణమై, ప్రసన్నత తాలూకు
సారం - జీవకళ-  అనదగ్గ
తెలిదామరలకూ చెందొవలకూ(సారస) ఆకరం
ఆనగరంలోని సరస్సమూహం(కాసారచయము).

No comments: