సలలితముగ దీని నెరుగు సరసుడు కలడే?
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి
శిల వృక్షలతల బుట్టిన
చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్
తలవాకిట రమియింతురు
సలలితముగ దీని నెరుగు సరసుడు కలడే?
శిల వృక్ష లతలకు పుట్టిన ముగ్గురు చెలువలను
తలవాకిటిలో రమిస్తారట - దీని అర్థం తెలిసిన
సరసుడు ఉన్నాడా? - అంటున్నాడు కవి.
శిల,వృక్ష,లత లకు చెలువలు పుట్టడమేమిటి?
తలవాకిట రమించడమేమిటి?
దీన్ని బాగా ఆలోచిస్తే..............
శిలనుంచి పుట్టింది - సున్నం,
వృక్షంనుంచి పుట్టింది - పోక(వక్క),
లతనుండి పుట్టింది - ఆకు(తమలపాకు)
ఈ మూడిటిని తలవాకిట అంటే నోట్లో వేసి కలిపిన(రమించిన)
రాగరసం ఉదయిస్తుంది.
ఇలాంటిదే మనం మొన్న ఒక పద్యం తెలుసుకొని ఉన్నాము
ఇపుడు మరొకసారి దాన్నికూడ చూద్దాం.
వండిగ నెండిన దొక్కటి
వండక మరి పచ్చిదొకటి వడి కాలినదిన్
తిండికి రుచియై యుండును
మండలమున జనులకెల్ల మహిలో వినుమా!
వండగనెండినదొక్కటి - వక్కలు
వండక మరి పచ్చిదొకటి - ఆకులు
వడి కావినదిన్ - బాగా కాలినది - సున్నం
తిండికి రుచియై యుండును - తాంబూలము
(వక్కలు, ఆకులు, సున్నము కలిసినది)
No comments:
Post a Comment