Tuesday, August 9, 2016

వ్రేలెత్తి నాగేటి చాలు జూపె


వ్రేలెత్తి నాగేటి చాలు జూపె


సాహితీమిత్రులారా!

ఈ క్రింది పొడుపు పద్యం చూడండి.

గురువరేణ్యా! వీర పురుషుఁడెవ్వండన్నఁ
        దలయెత్తి నిండు జాబిలిని జూపె
నిలలోఁ బ్రతివ్రతా తిలకమెవ్వతెయన్న
        వ్రేలెత్తి నాగేటి చాలు జూపెఁ
బరుల మేలునకేది మరణ మందెనటన్న
       సమ్ముఖమ్మన నండజమ్ముఁ జూపె
శక్తికొలఁది నేది భక్తిఁ జూపెనటన్న
       వ్రేళ్ళలో నొక మూడు వ్రేళ్ళు జూపె
భక్తి వీరులందెవ్వండు ప్రముఖుఁడన్న
దక్కినము నందుఁగల లంక దిక్కు జూపె
వీని భావమ్ము లవి యేవి యౌను దేవ
దేవ శ్రీ వేంకటేశ!  పద్మావతీశ!

                                         (శ్రీ వేంకటేశ సారస్వత వినోదిని - 19)

దీనిలోని భావాన్ని గ్రహించి సమాధానం చెప్పలి.

వీర పురుషుఁడెవ్వండన్నఁ దలయెత్తి నిండు జాబిలిని జూపె
దీనికి సమాధానం - రామచంద్రుడు 
(రామ - రమ్యమైన, చంద్రుడు - చంద్రుడు, జాబిల్లి,
 శ్రీరామచంద్రుడు మహావీరుడు)

నిలలోఁ బ్రతివ్రతా తిలకమెవ్వతెయన్న వ్రేలెత్తి నాగేటి చాలు జూపెఁ
దీనికి సమాధానం- సీత
(భూమిలో నాగేటి చాలులో సీత లభించింది ఆమె పతివ్రతా తిలకం)

బరుల మేలునకేది మరణ మందెనటన్న సమ్ముఖమ్మన నండజమ్ముఁ జూపె
దీనికి సమాధానం - జటాయువు
(సీతను రావణుడు అపహరించువేళ రావణునితో పోరి మరణించింది - జటాయువు)

శక్తికొలఁది నేది భక్తిఁ జూపెనటన్న వ్రేళ్ళలో నొక మూడు వ్రేళ్ళు జూపె
దీనికి సమాధానం - వీపుపై మూడు చారలుగల ఉడుత

భక్తి వీరులందెవ్వండు ప్రముఖుఁడన్న దక్కినము నందుఁగల లంక దిక్కు జూపె
దీనికి సమాధానం - భక్తులలో వీరుడు ఆంజనేయుడు ఈయన భక్త-వీరుడు.

ఇది రామాయణానికి సంబంధించిన పొడుపుపద్యం.

No comments: