రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
సాహితీమిత్రులారా!
జైనమతానికి చెందిన మహావీరాచార్యుడు
సంస్కృతంలో గణితసారసంగ్రహమనే పుస్తకాన్ని
వ్రాయగా దాన్ని12వ శతాబ్దికి చెందిన
పావులూరి మల్లన తెలుగులో అనువదించాడు
ఇంగులో మన వారు వినియోగించిన సంఖ్యలు
సంకేతరూపంలో ఉంటాయి అందువల్ల దానిలోని
ఒక శ్లోకం చూద్దాం-
దీన్ని సంకేత సంఖ్యా గూఢ చిత్రంగా
చెప్పుకొనవచ్చు-
ఇక్కడ మనం గమనించే సమస్యం ఏమిటంటే-
చదరంగంలో మొత్తం 64 గడులుంటాయికదా
అవి 8 గడులు అడ్డంగాను,
8 గడులు నిలువుగాను ఉంటాయి
మొత్తం 64 గడులు
ఈ చదరంగం 64 గళ్ళకు
1 నుండి 64 వరకు ప్రతిగడిని
రెట్టిస్తూ పోతే మొత్తం ఎంత వస్తుందనేది
ప్రశ్న దాని సమాధానం రెండూ పద్యంలో
చెప్పబడినవి చూడండి-
శరశశిషట్కచంద్రశరసాయకరంధ్రవియన్నగాగ్ని భూ
ధరగగనాబ్దివేదగిరితర్కపయోనిధి పద్మజాస్యకుం
జరతుహినాంశుసంఖ్యకు నిజంబగు తచ్చతురంగగేహవి
స్తరమగు రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
ఇందులో మనం కొన్ని పదాలకు
వాటి సంకేతాలను గమనించాలి-
గగనం, ఆకాశం, వియత్, రంధ్ర - వీటి సంకేతం - 0(సున్న)
వేద, అబ్ది, పద్మజాస్య - వీటికి సంకేతం - 4
శశి, చంద్ర, తుహినాంశు పదాలకు సంకేతం - 1
అగ్ని కి సంకేతము - 3
బాణ, శర, సాయక పదాలకు సంకేతం - 5
షట్క, తర్క, దర్శన లకు సంకేతం - 6
భూధర, గిరి, నగ - లకు సంకేతం -7
కుంజర, గజ, దిక్ పదాలకు సంకేతం - 8
శ్లోకంలోని పదాలకు సంకేతాలను తీసుకుంటే
ఇలా ఏర్పడుతుంది.
5 1 6 1 5 5 0 0 7 3
శరశశిషట్కచంద్రశరసాయకరంధ్రవియన్నగాగ్ని
7 0 4 4 7 6 4 4
భూధర గగనాబ్దివేదగిరితర్కపయోనిధి పద్మజాస్య
8 1
కుంజర తుహినాంశు
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగగేహవి
స్తరమగు రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
అయితే ఏర్పడిన సంఖ్యను
ఎడమనుండి కాక
కుడినుండి తీసుకోవాలి.
అంటే ఒకటినుండి 64 వరకు రెట్టిస్తూ పోతే
వచ్చే మొత్తం లబ్దపు సంఖ్యం ఇది-
18446744073709551615
No comments:
Post a Comment