Saturday, February 4, 2017

వైద్యంవారి చిత్రకవిత - 2


వైద్యంవారి చిత్రకవిత - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.....


శబ్దచిత్రం -

గుడులు-
ఇందులో కేవలం ఇ, ఈ - అనే స్వరంతో మాత్రమే
పద్యం కూర్చబడును. హల్లులు వేరేవైనా ఉండవచ్చు.
అచ్చుమాత్రం ఇ, ఈ -అనే దాన్ని మాత్రమే వాడాలని
నియమం.

గిరిఠీవిని నిలిపితి వీ
గిరి ప్రీతిని నిలిచి తివిరి కీరితి విరివిన్
సిరివిన్ నిగిడితి వీక్షితి
వరదా కురుమూర్తి శ్రీనివాస మహాత్మా(99)


సోష్ఠ్యము-
ఇది స- ఓష్ఠ్యము అంటే పెదవులతో మాత్రమే పలికే
అక్షరాలతో కూర్చబడినది. మీరు పలుకుతూ గమనించండి
ఇందులో కేవలం పెదవులుమాత్రమే కదులుతాయి.
ఇది శబ్దచిత్రంలోని స్థాన చిత్రవిభాగానికి చెందినది.


వేమాపాపము బాపవె
మాముప్పాపబ్బ మామ మామా మమ్మో
మోమాపబువా మాపా
వామన కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (100)

నిరోష్ఠ్యము -
ఇది పైన చెప్పిన సోష్ఠ్యానికి విరుగుడులాంటిది.
పూర్తి వ్యతిరేకమైనది. ఇందులో పెదిమలే
తగలకుండా పలికే అక్షరాలతో కూర్చినది
అంటే ప,ఫ,బ,భ,మ,వ - అనే అక్షరాలు ఓష్ఠ్యాలు
ఇవిలేకుండా పద్యం కూర్చడం నిరోష్ఠ్యం.
మీరు పలికి చూడండి ఇందులో పెదిమలు
తగులుతాయేమో

సురసన్నుత చరణా సం
సరణోదధి తరణ తరణి శరనిధి శరణా
కవిరాజ రుజాహరణా
వరదా కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (101)

అపంచవర్గీయము -
ఇందులో క,చ,ట,త,ప - అనే పంచవర్గముల
(క-నుండి మ- వరకు గల) అక్షరాలను
ఉపయోగించకుండా కూర్చిన పద్యం
ఇందులో య,ర,ల,వ,శ,ష,స,హ - అక్షరాలను
ఉపయోగించి కూర్చబడినది.
దీన్ని ముక్కుమూసుకొని కూడ చదువవచ్చు
కావున దీన్ని నిరనునాసిక అని కూడ అంటారు.
మీరు ముక్కమూసుకొని చదివి చూడగలరు.

హరశర యశోవిశాలా
సరసా శ్రీశ సరసిరుహశర సువిలాసా
శరరాశివశా లోలా
వరదా కురుమూర్తి శ్రీనివాస మహాత్మా(102)


(వీటిలో మకుటము తప్ప మిగిలిన పద్యభాగము చిత్రకవిత)


No comments: