Saturday, February 18, 2017

ఒక సీసపద్యంలో ద్విపద, మత్తకోకిల, కందములు


ఒక సీసపద్యంలో ద్విపద, మత్తకోకిల, కందములు




సాహితీమిత్రులారా!


ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని
ఈ సీసపద్యం(821)లో నాలుగు ద్విపదలు,
ఒక మత్తకోకిల, ఒక కందం ఎలా ఉన్నాయో చూద్దాం-
దీన్ని కూర్చినది గణపవరపు వేంకటకవిగారు
ఈయన చరిత్ర చిత్రకవిత్వంలో చెప్పాలంటే ఎంతో ఉంది
ఒకమారు ఆయన్నుగురించి తెలుసుకుందాం
ఇప్పుడు ఈ పద్యం చూద్దాం-

సారసోద్భవ శర్వ సన్నుత సారవా
          రణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి దా
          రుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీ
          రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భారపా
          ర సులక్షణాపటు రమ్యకృతిస
సవితృబింబ వసతి సౌర సమాదక
విజయ భూతరాజ విదితధీర
వేదవేద్యయ భవ వేదాంత తత్వజ్ఞ
యసురనాశ! వేంకటాచలేశ!

దీనిలో సీసపద్యంలోని నాలుగు పాదాలు నాలుగు ద్విపదలే
ఎలాగంటే సీసపద్యానికి
ప్రతి పాదానికి 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలుంటాయి
దీనిలో సగం ద్విపద పాదానికి
అంటే 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం
ఇవి సీసంపద్యంలోని ద్విపదపాదాలు-

గర్భిత ద్విపద-
సారసోద్భవ శర్వ సన్నుత సార
వా రణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి 
దా రుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార 
నీ రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భార
పార సులక్షణాపటు రమ్యకృతిస


ఈ సీస పద్యంలోని చివరి 6 అక్షరాలు
తొలగిస్తే మత్తకోకిల అవుతుంది.

సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీ రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణాపటు రమ్యకృతిస

ఇది గర్భితమత్తకోకిల-

సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణా
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణా
హారమానసయుక్త హారివిహార నీ రజ వీక్షణా 
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణా

కందము సీసపద్యంలోను
ఆటవెలదిలోను గూఢపరచబడినది
మత్తకోకిలకు పోను మిగిలిన అక్షరాలు
ఆటవెదిలోని మొదటి రెండు పాదాలలోని
అక్షరాలు కందంగా రూపొందుతాయి.
ఇందులో రెండవపాదం చివర దీర్ఘం ఉండాలి కావున
తి - అనేది తీ - గా తీసుకోవాలి.

సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీ రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణాపటు రమ్యకృతిస
సవితృబింబ వసతి సౌర సమాదక
విజయ భూతరాజ విదితధీ
వేదవేద్యయ భవ వేదాంత తత్వజ్ఞ
యసురనాశ వేంకటాచలేశ


గర్భిత కందము-

వసు రమ్య నేత్ర తత రూ
పసార నిధిరాజదాన పటు రమ్యకృతి
సవితృ బింబ వసతి సౌ
ర సమాదక విజయ భూతరాజ విదితధీ

No comments: