Tuesday, February 14, 2017

రూపమొక్కటి రెండు రూపులై చెలువొందు


రూపమొక్కటి రెండు రూపులై చెలువొందు




సాహితీమిత్రులారా!



జక్కన విక్రమార్కచరిత్రలోని
సంఖ్యా(శబ్ద)చిత్రం చూడండి-

కాశీలో మరణించినా గొప్ప కీర్తి
కారణమే అని చెప్పే పద్యం ఇది

రూపమొక్కటి రెండు రూపులై చెలువొందు
           మూఁడు మొనల పోటుముట్టుఁబట్టు
బాహు చతుష్కంబుఁ బంచాస్యములుఁబూను
           షణ్ముఖుపైఁ బ్రేమ సలుపుచుండు
సప్తాశ్వ చంద్రు లీక్షణములుగా నొప్పు
           నెనిమిది మూర్తుల వినుతి కెక్కు
నవనిధీశసఖుం డనఁగఁ గీర్తిని వహించుఁ
           బది కొంగులైన యంబరము గట్టుఁ
బదు నొకండు విధములఁ బ్రణుతి కెక్కు
వెలయఁ బండ్రెండు గనుపుల విల్లు పట్టుఁ
గర్మపాశలవిత్ర విఖ్యాతి మెఱయుఁ
గాశిలో మేనుఁ దొఱఁగిన ఘనయశుండు
                                                                (విక్రమార్కచరిత్రము -2-192)

ఈ పద్యంలో ఒకటి నుండి పండ్రెండు వరకు
సంఖ్యలను వరుసగా కూర్చడం జరిగింది.
కావున ఇది సంఖ్యా(శబ్ద)చిత్రముగా పేర్కొనవచ్చు.

మరణించిన జీవుడు మరణానికి ముందు ఒక్కడే.
తర్వాత  అర్థనారీశ్వర స్వరూపముగా రెండుగా అవుతాడు.
మూడు మొనలుగల (త్రిశూలం) ఆయుధం చేపట్టిన వాడవుతాడు
(పొడవటానికి ఉపయోగపడే సాధనం - పోటుముట్టులాగా).
నాలుగు చేతులు ఐదు మఖాలు కలవాడవుతాడు.
శివుడు పంచముఖలింగేశ్వరుడు గదా
ఆరు ముఖాలు గల కుమారస్వామిని లాలిస్తూ ఉంటాడు.
ఏడు గుర్రాలు రథముగా గల సూర్యుడు
చంద్రుడు నేత్రాలుగా కలవాడవుతాడు.
పంచభూతాలు- సూర్యుడు - చంద్రుడు- యజమానుడు
కలిసి అష్టమూర్తిగా ప్రసిద్ధుడవుతాడు.
నవనిధులకు అధిపతి అయిన కుబేరుని
స్నేహితునిగా కీర్తిని పొందుతాడు.
ఎనిమిది దిక్కులు - నేల - ఆకాశం
ఇవి పది కొంగులు వస్త్రాలుగా గల దిగంబరుడవితాడు.
ఏకాదశ రుద్రులుగా(పదనొకండు విధముల)కీర్తిని పొందుతాడు.
పండ్రెండు గుపులుగల పుండ్రేక్షువు వుల్లుగా ధరిస్తాడు.
పెద్ద చెఱకుగడ. ఇది అమ్మవారి విల్లు. కర్మలనే త్రాడును
త్రెంచటంలో కొడవలిగా(లవిత్ర) కీర్తి పొందుతాడు.


ఈ విధంగా పండ్రెండు వరకు
సంఖ్యలను పద్యంలో ఉపయోగించాడు
జక్కనమహాకవి.

No comments: