Wednesday, February 22, 2017

సంఖ్యా(శబ్ద)చిత్రం


సంఖ్యా(శబ్ద)చిత్రం



సాహితీమిత్రులారా!


ఒక పద్యంలో సంఖ్యలు వరుసగా ఉపయోగిస్తే దాన్ని
సంఖ్యా(శబ్ద)చిత్రంగా చెప్పవచ్చు. ఈ పద్యం చూడండి-
అనంతామాత్యుని భోజరాజీయం(7-245)లోనిది

చర్చింప రెండవ చంద్రుడు మూడవ
                         యశ్విని నాలవ యగ్నిదేవు
డైదవ లోకపాలాఖ్యు డారవ పాండు
                           సంతానమేడవ చక్రవర్తి
యెనిమిదవనయగు సన్మునీశుడా తొమ్మిదవ
                            యగు భోగిపతి పదియవ విరించి
పదునొకండువ చక్రపాణి పండ్రెండవ 
                             శూలి పద్మూడవ సూర్యుడనగ
దనరు గాంతిరూపమున బ్రతాపమున స
త్యమున ధర్మచరిత నాజ్ఞ శుచిని
భూరిసత్త్వమున బ్రబుద్ధత గలిమిని
భూతి దేజమునను భోజవిభుడు
                                    (భోజరాజీయము - 7-245)

భోజుడు ఎలాంటివాడో అనంతామాత్యుడు
ఈ పద్యంలో వివరించాడు

రెండవ చంద్రుడు,
మూడవ అశ్విని,
నాలుగవ అగ్నిదేవుడు,
ఐదవ లోకపాలకాఖ్యుడు,
ఆరవ పాండు సంతానము,
ఏడవ చక్రవర్తి,
ఎనిమిదవ సన్మునీశ్వరుడు,
తొమ్మిదవ భోగపతి,
పదియవ విరించి,
పదునొకొండవ చక్రపాణి,
పండ్రెండవ శూలి,
పదమూడవ సూర్యుడు

ఇవి ఏ విధంగా అంటే
కాంతిలో చంద్రుడు అయితే
భోజుడు రెండవ చంద్రుడు,
రూపంలో అశ్వనీదేవతలు(ఇద్దరు) అసమానులు
భోజుడు మూడవ అశ్విని,
ప్రతాపంలో అగ్ని(ముగ్గురు) భోజుడు నాలుగవ అగ్ని,
సత్యంలో  లోకపాలకులు(నలుగురు)
భోజుడు ఐదవ లోకపాలకుడు,
ధర్మచరిత్రలో పాండవులు(ఐదుగురు)
భోజుడు ఆరవ పాండు సంతానము,
ఆజ్ఞలో చక్రవర్తులు ఆరుగురు భోజుడు ఏడవ చక్రవర్తి,
శుచిలో సప్తర్షులు భోజుడు ఎనిమిదవ మహర్షి,
భూరి(గొప్పదైన బలంలో) సత్వంలో శేషుడు
మొదలైన ఎనిమిదిమంది నాగరాజుల
తర్వాత భోజుడు తొమ్మిదవ భోగిపతి,
వికాసంలో నవబ్పహ్మవతర్వాత పదియవ బ్రహ్మ భోజుడు,
సంపదలో పదనొకొండవ విష్ణువు భోజుడు,
ఐశ్వర్యంలో పండ్రెండవ శివుడు,
తేజంలో పదమూడవ సూర్యుడు
అంతటి గొప్పవాడని అనంతామాత్యుడు భోజుని వర్ణించాడు.


అశ్వనిదేవతలు - ఇద్దరు , ఒకరు నాసత్యుడు,
                                  మరొకరు దస్రుడు
త్రేతాగ్ని - పావకుడు, పవమానుడు, శుచి

లోకపాలకులు - ఇద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు

షట్చక్రవర్తులు - హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు,
                              పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు

సప్తర్షులు - వసిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు,
                    భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు

నవబ్రహ్మలు - మరీచి, అత్రి, భృగుడు, పులస్త్యుడు, పులహుడు,
                           క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, వామదేవుడు

దశావతారాలు - మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన,
                            పరశురామ, శ్రీరామ, బలరామ, బౌద్ధ, కల్కి

ఏకాదశరుద్రులు - అజైకపాదుడు, అహిర్భుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు,
                                 హరుడు, త్య్రంబకుడు,వృషాకపి, శంభుడు, కపర్ది,
                                  మృగవ్యాధుడు, శర్వుడు

ద్వాదశాదిత్యులు-
                                 ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు,
                                 త్వష్ట, పూష, అర్యముడు,
                                  భగుడు, వివస్వంతుడు, విష్ణువు,
                                  అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు

జక్కన విక్రమార్కచరిత్రలోని
సంఖ్యా(శబ్ద)చిత్రం చూడండి-

కాశీలో మరణించినా గొప్ప కీర్తి
కారణమే అని చెప్పే పద్యం ఇది

రూపమొక్కటి రెండు రూపులై చెలువొందు
           మూఁడు మొనల పోటుముట్టుఁబట్టు
బాహు చతుష్కంబుఁ బంచాస్యములుఁబూను
           షణ్ముఖుపైఁ బ్రేమ సలుపుచుండు
సప్తాశ్వ చంద్రు లీక్షణములుగా నొప్పు
           నెనిమిది మూర్తుల వినుతి కెక్కు
నవనిధీశసఖుం డనఁగఁ గీర్తిని వహించుఁ
           బది కొంగులైన యంబరము గట్టుఁ
బదు నొకండు విధములఁ బ్రణుతి కెక్కు
వెలయఁ బండ్రెండు గనుపుల విల్లు పట్టుఁ
గర్మపాశలవిత్ర విఖ్యాతి మెఱయుఁ
గాశిలో మేనుఁ దొఱఁగిన ఘనయశుండు
                                                                (విక్రమార్కచరిత్రము -2-192)

ఈ పద్యంలో ఒకటి నుండి పండ్రెండు వరకు
సంఖ్యలను వరుసగా కూర్చడం జరిగింది.
కావున ఇది సంఖ్యా(శబ్ద)చిత్రముగా పేర్కొనవచ్చు.

మరణించిన జీవుడు మరణానికి ముందు ఒక్కడే.
తర్వాత  అర్థనారీశ్వర స్వరూపముగా రెండుగా అవుతాడు.
మూడు మొనలుగల (త్రిశూలం) ఆయుధం చేపట్టిన వాడవుతాడు
(పొడవటానికి ఉపయోగపడే సాధనం - పోటుముట్టులాగా).
నాలుగు చేతులు ఐదు మఖాలు కలవాడవుతాడు.
శివుడు పంచముఖలింగేశ్వరుడు గదా
ఆరు ముఖాలు గల కుమారస్వామిని లాలిస్తూ ఉంటాడు.
ఏడు గుర్రాలు రథముగా గల సూర్యుడు
చంద్రుడు నేత్రాలుగా కలవాడవుతాడు.
పంచభూతాలు- సూర్యుడు - చంద్రుడు- యజమానుడు
కలిసి అష్టమూర్తిగా ప్రసిద్ధుడవుతాడు.
నవనిధులకు అధిపతి అయిన కుబేరుని
స్నేహితునిగా కీర్తిని పొందుతాడు.
ఎనిమిది దిక్కులు - నేల - ఆకాశం
ఇవి పది కొంగులు వస్త్రాలుగా గల దిగంబరుడవితాడు.
ఏకాదశ రుద్రులుగా(పదనొకండు విధముల)కీర్తిని పొందుతాడు.
పండ్రెండు గుపులుగల పుండ్రేక్షువు వుల్లుగా ధరిస్తాడు.
పెద్ద చెఱకుగడ. ఇది అమ్మవారి విల్లు. కర్మలనే త్రాడును
త్రెంచటంలో కొడవలిగా(లవిత్ర) కీర్తి పొందుతాడు.


ఈ విధంగా పండ్రెండు వరకు
సంఖ్యలను పద్యంలో ఉపయోగించాడు


జక్కనమహాకవి.

ఇందులో ఒకటి నుండి పది వరకుగల
సంఖ్యలను పద్యంలో ఉపయోగించాడు


జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుఁడాజింద్రిలో
చనుఁడుద్యచ్చతురంగ సైన్యుఁడును భాస్వద్రూపపంచాస్త్రుఁడ
న్యనృపక్రౌంచషడాననుండు ఘనసప్తాశ్వాన్వయుండష్టమం
త్రి నవద్రవ్యనిధీశుఁడై దశరథాధీశుండు పెంపొందగన్ 


లోకైక = (లోక+ ఏక) = 1
ద్వి = 2, త్రి= 3, 
చతురంగ - (చతుః - అంగ) పదంలో - 4
పంచాస్త్ర లో - 5, షడాననలో - 6 , సప్తాశ్వలో - 7,
అష్టమంత్రిలో - 8, నవద్రవ్య లో 9, 
దశరథలో 10 ఈ విధంగా 
కవి సంఖ్యలను పద్యంలో 
ఉపయోగించాడు

No comments: