Friday, February 10, 2017

ఆలి నొల్లక యున్న వానమ్మ మగని


ఆలి నొల్లక యున్న వానమ్మ మగని




సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర పద్యం చూడండి -

ఆలినొల్లక యున్న వానమ్మ మగని
నందులోపలనున్న వానక్క మగని
నమ్మినాతని జెరచు దానమ్మ సవతి
సిరుల మీకిచ్చు నెప్పట్ల గరుణ తోడ

ఇది చివరి పాదాన్ని బట్టి
ఆశీర్వాద పద్యమని తెలుస్తున్నది

దీనిలో అన్నీ పైకి ప్రత్యక్షంగా
అర్థం తెలిసేవిధంగా లేవు.
అంటే గూఢంగా చెప్పడుతున్నది.
అందుకే దీన్ని గూఢచిత్ర పద్యం అంటారు


ఆలినొల్లనివాడు - భీష్ముడు,
భీష్ముని అమ్మ - గంగ,
గంగకు మగడు - సముద్రుడు
అందులో దాగి ఉన్నది - మైనాకుడనే పర్వతం,
మైనాకుని అక్క - పార్వతి,
పార్వతి మగడు - శివుడు,
శివుని నమ్మినవాడు - రావణాసురుడు,
రావణాసురుని చెరచినది - సీత,
సీత అమ్మ - భూదేవి,
భూదేవి సవతి - లక్ష్మీదేవి
ఆమె ఎల్లపుడు దయతో
మీకు సంపదలిచ్చుగాక! -
అని భావం.


No comments: