పదునేడవ రాజు ధరాతలమ్మునన్
సాహితీమిత్రులారా!
తెలుగుభాషమీది సాహిత్యంమీది
అభిమానంకలిగిన ఎందరినో కవులను
పండితులను ఆదరించడం వల్ల
మాలిక్ ఇబ్రహీం అనే
గోలుకొండ కుతుబ్ షాహీ
మల్కిభరాముడుగా
పిలువబడుతున్నాడు
ఆ మల్కిభరాముని మీద
వ్రాయబడిన పద్యం ఇది
ఇందులో సంఖ్యా(శబ్ద)చిత్రం కలదు
చూడండి-
ఏడు కులాద్రు, లెక్కివెసనేడు పయోధులు దాటి లీలమై
ఏడవు దీవులం దిరిగి యోడుగడన్విహరించి కీర్తి యీ
రేడు జగమ్ముల న్వెయనే చిన మల్కిభరాము చంద్రుడే
ఏడవ చక్రవర్తి పదునేడవ రాజు ధరాతలమ్మునన్
మల్కిభరాముని కీర్తి కలపర్వతాలను ఏడింటిని ఎక్కి,
ఏడు సముద్రాలను దాటి, సప్తద్వీపపాలలో సంచరించి
సమస్తంగా విహారం చేసి పదునాల్గులోకాలలో వృద్ధి పొందగా,
భూమి మీద అతడు ఏడవ చక్రవర్తి, పదిహేడవ మహారాజు అని
చెప్పవచ్చును - అని భావం.
ఇంతవరకు షట్చక్రవర్తులు,
షోడశమహారాజులు ప్రసిద్ధిగా ఉన్నారు
ఇప్పుడీయన వారిసరసన చెప్పదగిన
కీర్తి కలవాడు అని తాత్పర్యము.
కులపర్వతాలు - (7)
మహేంద్రం, మలయం, సహ్యం, మాల్యవంతం,
ఋక్షం, వింధ్య, పారియాత్రం - ఈ ఏడు కులపర్వతాలు
సముద్రాలు - (7)
1. లవణసముద్రం, 2. ఇక్షుసముద్రం, 3. సురాసముద్రం,
4. సర్పిసముద్రం, 5. దధిసముద్రం, 6. క్షీరసముద్రం
7. జలసముద్రం.
ద్వీపము (7)
జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలు
లోకాలు - 14
ఊర్ధ్వలోకాలు - 7
భూలోక, భువర్లోక, సువర్లోక,
మహాలోక, జనలోక, తపోలోక,
సత్యలోకాలు
అధోలోకాలు - 7
అతల, వితల, సుతల, తలాతల,
మహాతల, రసాతల, పాతాళలోకాలు
చక్రవర్తులు - 6
1. హరిశ్చంద్రుడు, 2. నలుడు, 3. పురుకుత్సుడు,
4. పురూరవుడు, 5. సగరుడు, 6. కార్తవీర్యార్జునుడు
మహారాజులు - 16
1.గయుడు, 2. అంబరీషుడు, 3. శశిబిందువు,
4. అంగుడు, 5. పృథువు, 6. మరుతి,
8. సహోత్రుడు, 8. పరశురాముడు, 9. శ్రీరాముడు,
10. భరతుడు, 11. దిలీపుడు, 12. నృగుడు,
13. రంతిదేవుడు, 14. యయాతి, 15. మాంధాత,
16. భగీరథుడు
No comments:
Post a Comment