నా దండకును వెలఁబెట్ట నెవ్వని తరంబు?
సాహితీమిత్రులారా!
పుష్పలావికలు(పువ్వులు అమ్మే యువతులు)
మాట్లాడేతీరు
ఇంతకు మునుపు చూచి ఉన్నాము.
ఇపుడు ఆముక్తమాల్యదలో
పుష్పలావికలను గురించిన
పద్యాన్ని చూద్దాం.
వెలఁది! యీ నీదండ వెల యెంత? నాదండకును వెలఁబెట్ట నెవ్వని తరంబు
కలువ తావులు గాన మలికదంబకవేణి! కలువతావులు వాడకయ కలుగునె?
కడివోదు నాకిమ్ము పడఁతి! యీ గేదంగి నన కడివోమి ముందఱికిఁ జూడు
జాతు లే వంబుజేక్షణ! పద్మినులుసైతమును నున్న యెడ జాతులునికి యరుదె?
(యనుచుఁ దొలినుడి నభిలాష లెనయ మూఁగి
పలుకుతోడనె నర్మగర్భంబుగాఁగ
నుత్తరము పల్లవశ్రేణి కొసఁగు చలరు
లమ్ముదురు పుష్పలావికలప్పురమున)
(ఆముక్తమాల్యద - 2-12)
విటుడు - వెలఁది! యీ నీదండ వెల యెంత?
ఓ యువతీ(వెలఁది) ఇదిగో నీదండ వెల ఎంత
(దండ అంటే పూలదండ పైకి కనిపించే అర్థం, కౌగిలి(కైదండ),
సామీప్యం అని లోని ఆంతర్యం.)
పుష్పలావిక - నాదండకును వెలఁబెట్ట నెవ్వని తరంబు?
నా దండకు వెల చెప్పడం(వెలగట్టడం) ఎవడి తరం నాయనా?
విటుడు - కలువ తావులు గాన మలికదంబకవేణి!
తుమ్మెదల గుంపు వంటి జడదానా(అళి - కదంబక - వేణి) సరే ఇంతకీ కలువ(ల)
తావులు(పరిమళాలు) కనిపించలేదు నీ అంగడిలో
(అన్ని పూలున్నాయిగాని కలువలు కనిపించటంలేదే - అని పైకి.
నాయిక నాభిని - కలువపూలతో, నీటి సుడులతో కవులు పోలుస్తారు.
అంటే విటుడు నాయిక నాభిని కనిపించడం లేదనేగా అడుతున్నది.)
పుష్పలావిక- కలువతావులు వాడకయ కలుగునె?
ఎక్కడన్నా కలువలకు పరిమళాలు వాడిపోకుండా గుప్పుమంటాయా?
(కలువలు, పొన్నలు, మొగలిపూలు వాడే కొలది వాసన వస్తాయి.
ఇవి తాజావని సమాధానం పైకి.
నాభి వగైరా ప్రదేశాలు వాడకముందే (ఉపయోగించకముందే)
కనిపిస్తాయా? అన్నది లోని సమాధానం)
విటుడు - కడివోదు నాకిమ్ము పడఁతి!
పడతీ! ఇదుగో ఈ మొగలిపువ్వు నలిగినట్టే లేదే?
(తాజా పువ్వును చూపిస్తూ) నాకు ఇయ్యి?
(కడిపోదు - నలిగిపోదు)
పుష్పలావిక - యీ గేదంగి నన కడివోమి ముందఱికిఁ జూడు
అవునవును. ఈ పువ్వు నలగకపోవడం వడలిపోవడం -
ఇదంతా ముందుముందు తెలుస్తుందిలే - ముందరిక చూడు
(కడి అంటే అన్నపు ముద్ద, విరహం తట్టుకోలేక
(కడి + పోమి) ఇదంతా నీకు ముందు ముందు తెలుస్తుంది
- అనేది అంతర్యం)
విటుడు - జాతు లే వంబుజేక్షణ!
పద్మాల్లాంటి కన్నులుగలదానా!(అంబుజేక్షణ)
నీ అంగడిలో జాజులు (జాతి - జాజి) ఏవి కనిపించవేమిటి?
(జాతి అంటే నీవు ఏజాతికి చెందిన దానివి పద్మిని,
శంఖిని, హస్తిని మొదలైన జాతులలో)
పుష్పలావిక - పద్మినులుసైతమును నున్న యెడ జాతులునికి యరుదె?
పద్మినులు కూడా ఉన్న అంగడిలో
జాజులుండడం(ఉనికి) అరుదా?
(పద్మనీ జాతి వేశ్యలే ఉన్నచోట మిగతా జాతులవారు ఉండరా!
అది అంత అరుదా? అని లోని ఆంతర్యం)
1 comment:
chaalaa baagumdi
Post a Comment