Sunday, July 10, 2016

నెలఁత తన విభుఁడునుఁదాను నెత్తమాడె


నెలఁత తన విభుఁడునుఁదాను నెత్తమాడె


సాహితీమిత్రులారా!

పింగళి సూరన కళాపూర్ణోదయము లోని
సంభాషణ చిత్రం చూడండి.
రంభ - నలకూబరుడు విమానంలో వెడుతూ
పాచికలాడుతూ పరస్పర సరససంభాషణము
చేసుకొనే పద్యం ఇది.
చూడండి.

నిలు మహో బొంకకు నెత్తకమ్మటంచుఁ
       బక్షులుల్కెడు నొయ్యఁబలుకు మనుచుఁ
జిక్కె నీ సారె నా చేనంచుఁజిక్కె నౌ
       దీనిపాలిటి కూడు దిన్న ననుచు
నదె దుగ తివకుమీ సుదతి నీవంచు నౌ
       నిదె సారె దాఁకె నీ యిచ్చ యంచు
నినుమాటు దంచిన నెసటి పోఁత లటంచు
       నౌనట్ల యుడికె(దు)డుఁగాని యంచు
నిట్టి దంటమాటలు నేర్చి తెచట ననుచు
దంట నేనౌట నీ సంగతమున నంచుఁ
(దమ పరస్పర సరస వాక్యములుఁదనర
నెలత తన విభుఁడునుఁదాను నెత్తమాడె)
                 (కళాపూర్ణోదయము -6-120)
నలకూబరుడు -  నిలు మహో బొంకకు నెత్తకమ్మటంచుఁ
                        ఆగు ఆగు(నిలుము) అహో! పెట్టిన పందెంగురించి
                         (నెత్తకమ్ము) అబద్ధం ఆడకు.
                         (మధుపాన చుంబనాలింనాలే వారి పందేలు)
రంభ - బక్షులుల్కెడు నొయ్యఁబలుకు మనుచుఁ
           పక్షులు భయపడతాయి(ఉల్కెడున్),
           కాసింత నెమ్మదిగా మాటాడవయ్యా బాబూ!
           (విమానంలో పోతున్నారు కదా చుట్టు పక్కల ఎగిరే పిట్టలు
              జడుసుకుంటాయని పైకి
              తమతో విమానంలో ఉన్న నలుగురు వనితలకు
              తమ సంగతి తెలిపోతుందని ఆంతరము.)
నలకూబరుడు- జిక్కె నీ సారె నా చేనంచుఁజిక్కె నౌ
                       రంభా! ఇదిగో నీ పాచిక(సారె) నా చేతికి చిక్కింది
                       (సారె అంటే పాచిక, గోరింక - నీ పెంపుడు గోరింక
                         (నువ్వు పందేం పెట్టినది) నా చేతికి చిక్కింది అనడం - పైకి.
                         సారె అంటే పాచిక ఆకారంలో ఉండే స్తనాగ్రం.
                          అది నా చేతికి చిక్కింది అని ఆంతరం.)
రంభ - దీనిపాలిటి కూడు దిన్న ననుచు
           అవునా! నా పాచిక నీ చేతికి చిక్కింది, దీని పాలిటి పణం అంతా
           నువ్వు తినేశావు - గెలుచుకున్నావుగదా మరి.
నలకూబరుడు - నదె దుగ తివకుమీ సుదతి నీవంచు నౌ
                         అందమైన పలువరుసగలదానా!(సుదతి)
                         ఇదిగో! నాకు పాచికల్లో రెండు(దుగ) పడింది.
                         దీన్ని తోసెయ్యకు (తివకుము)సుమా(స్తనద్వయం రెండూ
                         దొరికాయి నెట్టెయ్యకు అని ఆంతరం.)
రంభ -  నిదె సారె దాఁకె నీ యిచ్చ యంచు
              అవును! నీకు రెండు(దుగ)పడింది నిజమే
               కానీ ఇదిగో సారె తాకింది(అంటే అతడి గవ్వ ఉన్న గడిలోకి ఈమె
               గవ్వ చేరి దానిని చంపడం) మరి నీ ఇష్టం ఏం చేస్తావో!
               (నా స్తనద్వయాన్ని సారె సారెకూ (మాటిమాటికి) తాకుతున్నావుగదా!
                నీ ఇచ్చ - తీర్చుకో - అని ఆంతరము)
నలకూబరుడు - నినుమాటు దంచిన నెసటి పోఁత లటంచు
                         ఇలా రెండుసార్లు(ఇనుమాటు) నాగవ్వ చంపేస్తే(దంచినన్)ఎలా?
                          ఇవ్వెక్కడి సారెపోతలు ఇలా ఎసరులు పెట్టడాలైతే (ఎసటి - పోతలు)
                          ఇంక నీతో ఆడేదెలా? గెలిచేదెలా?(ఇనుమాటు దంచడంలోని ఆంతర్యం ఊహిచండి)
రంభ - నౌనట్ల యుడికె(దు)డుఁగాని యంచు
           అవును! అలాగే ఉడుక్కుందువుగానిలే
          (దంచిన బియ్యం ఎసట్లో పొయ్యండం ఉడికించుకోవడం - ఇది ఆంతర్యం)
నలకూబరుడు- నిట్టి దంటమాటలు నేర్చి తెచట ననుచు
                        రంభా! ఇలాంటి గడసరిమాటలు(దంటమాటలు) ఎక్కడ నేర్చావు?
రంభ - దంట నేనౌట నీ సంగతమున నంచుఁ
           నేను గడసరిగా మారింది (దంటనౌట) నీ సాంత్యంవల్లనే
           (సంగతి- సంగతము - అనే పదాలకు స్నేహం, సంభోగం,
            కలయిక అనే అర్థాలున్నాయి.)

              

No comments: