Wednesday, July 20, 2016

రారాజు రతిరాజు రాజరాజును గూడి.....


రారాజు రతిరాజు రాజరాజును గూడి.....


సాహితీమిత్రులారా!

పొడుపు పద్యాలను బహువిధములైనవి చూచి ఉన్నాము
ఇదో విధము పరికించండి.
పరిశీలించండి.
సమాధానాలు చెప్పగలరేమో?
ఆలోచించండి

ఏనుగు సింగంబు, నెలనాగయును గూడి 
          యొకమాటలోపల నుండవలయు
దశరథాగ్రసుతుండు,శశియును పట్టణం
           బొకమాట లోపల నుండవలయు
దర్పకాంతకుడు నేత్రంబును మాలయు
           నొకమాటలోపల నుండవలయు
వేల్పును త్రోవయు వెలయు ప్రసూనంబు 
           నొకమాటలోపలనుండవలయు
కనకంబు కార్పాన మొనర మహీజంబు
           నొకమాట లోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
           నొకమాట లోపల నుండవలయు
పక్షియు వృక్షంబు పాషాణమును గూడి
            నొకమాట లోపల నుండవలయు
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుడు గూడి
           నొకమాట లోపల నుండవలయు
దీని యర్థంబు జెప్పగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను
చెప్పినాతడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత కృష్ణరాయ క్షితీంద్ర

దీన్ని చూశారు కదా ఆలోచించండి ఆయన ఏకంగా
12 నెలలు అంటే 1 సంవత్సరం గడువిస్తున్నాడు
దీన్ని సాధించలేరని కవిగారి ప్రగాఢ నమ్మకమేమో!

దీనిలోని షరతులు -
ఒకటే షరతు ఇచ్చిన పాదంలోని పదాలతో 
ఒకమాటలో సమాధానం ఉండాలి.
సమాధానం చెప్పినవారిని భావజ్ఞశేఖరునిగా గుర్తించటం.

1. నాగకేసరాలు  (ఇది ఒక చెట్టుపేరు.)
  (నాగ అంటే ఏనుగు,
   కేసరి - సింహం,
   ఆలు - పడుచుది(ఎలనాగ)
   ఈ మూడు పదాలకలయిక నాగకేసరాలు)
2. రామచంద్రపురము (ఇది ఒక ఊరిపేరు)
   (రామ - దశరథుని పెద్దకొడుకు,
    చంద్ర - శశి - చందమామ
    పురము - పట్టణము .
    ఈమూడు పదాలకలయిక - రామచంద్రపురము)
3. రుద్రాక్షమాల (భక్తులు మెడలో ధరించు దండ)
   (రుద్ర - దర్పాంతకుడు (శివుడు)
    అక్ష - కన్ను
    మాల - దండ
    ఈమూడు పదాలతో ఏర్పడినది రుద్రాక్షమాల)
4. దేవదారి పుష్పము (ఒక పువ్వు)
   (దేవ - వేల్పు, దేవత
   దారి - త్రోవ
   పుష్పము - ప్రసూనము
   ఈ మూడు పదాల కలయిక - దేవదారి పుష్పము)
5. పైడిపత్తిచెట్టు (ఒక రకమైన చెట్టు)
   (పైడి - కనకము (బంగారము)
   పత్తి - కార్పనము(దూది)
   చెట్టు - మహీజము (వృక్షము)
   ఈ మూడు పదాలకలయిక - పైడిపత్తిచెట్టు)
6. రాజమదన కుబేరము (ఒక ఔషధము పేరు)
   (రాజ - రారాజు - దుర్యోధనుడు
   మదన - మన్మథుడు - రతిరాజు
   కుబేరము - కుబేరుడు - రాజరాజు
   ఈ మూడు పదాల కలయిక - రాజమదన కుబేరము)
7. పిట్టపేపరాయి 
   (పిట్ట - పక్షి
    పేప - పేము చెట్టు
    రాయి - పాషాణము (శిల)
    ఈ మూడు పదముల కలయిక - పిట్టపేపరాయి)
8. నాగగరుడేశ్వరము (ఒక పుణ్యక్షేత్రము)
   (నాగ - పాము (ఫణిరాజు)
    గరుడ(పక్షి) - ఫణివైరి
    ఈశ్వరము - శివుడు (పణిభూషణుడు)
    ఈ మూడు పదముల కలయిక - నాగగరుడేశ్వరము)

          

No comments: