ఐంద్రజాలిక శక్తిని దెలియుడీ భావవిదులు
సాహితీమిత్రులారా!
ఇదొక పొడుపు పద్యం.
ఈ పద్యం చదివి భావాన్ని గ్రహించి
ప్రత్యుత్తరమీయండి-
సార్వభౌమునినైన సన్యాసిగా జేయు,
జోగినైనను మహాభోగి జేయు,
తలక్రిందుగనె పర్వతము లెక్కగా జేయు,
వారాశి మోకాలి బంటి జేయు,
వినువీథి నవలీల విహరింపగా జేయు,
సింగంబుపై స్వారిచేయ జేయు,
భగ భగమను నగ్ని దిగమ్రింగగా జేయు,
అల చందమామ ముద్దాడ జేయు,
బొందితోడనె స్వర్గంబు పొందజేయు.
నవ్వులో నేడ్పు, నేడ్పులో నవ్వజేయు,
ఐంద్రజాలికశక్తిగా నొనరునట్టి
రమ్యమగుదాని దెలియుడీ భావవిదులు
దీనికి సమాధానము - కల (స్వప్నము)
సాధారణంగా కలలో వచ్చినది నిజంగా జరగవచ్చు,
జరగకపోవచ్చు. కాని, ఆ, కల మాత్రం మనలను పరిపరి విధాల
ప్రజలను పలవరింపజేస్తుందనడం మాత్రం నిజం.
ఎట్లాగంటే - ఆ కలలో అందరికి, ఒక గొప్ప చక్రవర్తిని ఏమీలేని
సన్యాసిని, బికారిని చేసేస్తుంది.
సర్వసంగ పరిత్యాగిని సర్వసౌఖ్యములను అనుభవింపజేసి
మహాభోగిగా మలచి చూస్తుంది.
తల్లక్రిందుగా పర్వతం ఎక్కినట్లు చూపిస్తుంది.
అంతులేని సాగరాన్ని అడుగు లోతు తక్కువగా ఉన్నట్లు చేస్తుంది.
ఆకాశంలో సులభగంగా విహరించినట్లు చేస్తుంది.
కణకణ మండె నిప్పును మ్రింగినట్లు చేస్తుంది.
చంద్రుని తాకినట్లు, ముద్దు పెట్టుకున్నట్లు చేస్తుంది.
బొందితో స్వర్గానికి పోయినట్లు, నవ్వులో ఏడ్చినట్లు,
ఏడుపులో నవ్వినట్లు చేసి నాట్యమాడిస్తుంది.
ఇన్నిటిని ఇలలో చేయగలమా కలగాక!
No comments:
Post a Comment