సుతు వాహన వైరి వైరి సున్నం బిదిగో!
సాహితీమిత్రులారా!
పర్వత శ్రేష్ఠపుత్రికా పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి,
ప్రేమ వారింట పెరిగిన పెద్దబిడ్డ
సున్నమిప్పుడు తేగదే సుందరాంగి!
అని సున్నం అడిగాడు కదా!
దానికి ఆమె మాత్రం తక్కువ తిన్నదా!
ఆమె ఈ పద్యం చెప్పి సున్నం ఇచ్చిదట.
చూడండి ఆ పద్యం..........
శత పత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతు వాహన వైరివైరి సున్నం బిదిగో!
శతపత్రంబుల మిత్రుడు - తామరలకు ఆప్తుడు - సూర్యుడు,
సూర్యుని సుతుడు- కర్ణుడు,
కర్ణుని జంపినవాడు - అర్జునుడు,
అర్జునుని బావ - కృష్ణుడు,
కృష్ణుని సూనుడు - మన్మథుడు,
మ్నమథుని మామన్ - చందమామ,
చందమామను సతతము దాల్చువాడు - శివుడు,
శివుని సుతుడు - వినాయకుడు,
వినాయకుని వాహనము - ఎలుక,
ఎలుక వైరి - పిల్లి,
పిల్లి వైరి - కుక్క,
ఓ కుక్కా సున్నం ఇదుగో అని అన్నది ఆమె.
దరిద్రపు పెద్దమ్మా సున్నమేదీ? - అంటే
కుక్కా ఇదుగో! సున్నం - అంది ఆమె
సరిపోయిందా! మాటకుమాట.
ఎంత చమత్కారం.
1 comment:
చాలా బాగుందండీ !
గరికిపాటి వారు కూడా ఈ పద్యాన్ని ఓ మారు సాహిత్యం లో హాస్యం అన్న తెలుగు వొన్ టీవీ కార్యక్రమం లో ఉదహరించినట్టు గుర్తు ( వారి స్టయిల్లో :))
చీర్స్
జిలేబి
Post a Comment