ఆద్యంతమాది మధ్యమ వర్ణములలోన.......
సాహితీమిత్రులారా!
పొడుపు పద్యాలలో మరో విధం చూడండి.
సమాధానాలు ఊహించగలరేమో?
ఆలోచించండి.
ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
జోడును, సుదయును గూడవలయు
ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
నదియు, ఖడ్గంబును బొదలవలయు,
ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
రూపంబు, ధూపంబు దోపవలయు,
ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
ఎల్ల, విషంబు రంజిల్ల వలయు
అన్నిటికిగూడ మూడేసి యక్షరములు
మరియు, నా యుత్తరములే క్రమంబుగాను
కుంభమును, నిసుకయును, వకుళము, సాము
గావలె సుమండి! ధీరాగ్ర గణ్యులార!
షరతులు -
1. సమాధానాలన్నీ మూడక్షరాలలోనే ఉండాలి.
2. మొదటి, చివరి అక్షరాలను కలిపిన ఒక అర్థం,
మొదటి, మధ్య అక్షరాలను కలిపిన ఒక అర్థం,
మూడక్షరాలకు ఇంకో అర్థం రావాలి.
3. సమాధానాలు వరుసగా కుంభము, ఇసుక, వకుళము, సాము -
అనే అర్థాలను ఇవ్వాలి.
చూశారు కదా!
ఆలోచించండి.
1. మొదటి పాదానికి సమాధానం - కడవ
(మొదటి, చివరి అక్షరాలను కలపగా - కవ (- జంట, జోడు)
మొదటి, మధ్య అక్షరాలను కలపగా - కడ (- చివర, సుద)
మొత్తం సమాధానాము - కడవ (కుండ, కుంభం))
2. రెండవ పాదం సమాధానం - వాలుక
( వాక - నది,
వాలు - కత్తి,
వాలుక - ఇసుక)
3. మూడవ పాదం సమాధానం - పొగడ
(పొడ - రూపు, గుర్తు,
పొగ - ధూమము, ఆవిరి,
పొగడ - వకుళ వృక్షం)
4. నాలుగవ పాదం సమాధానం - గరిడి
(గడి - ఎల్ల, మేర.
గరి - పాము(గరము(విషము)కలది)
గరిడి - సాము)
No comments:
Post a Comment