అనంతరత్న ప్రభవస్యయస్య:
సాహితీమిత్రులారా!
ఒకమారు మంగళేశ్వరశాస్త్రులుగారు
విజయనగర సంస్థానములో దుబాసిగా ఉన్న అనంతరావు దగ్గరు
ఏదో పనిమీద వెళ్ళారు.
ఆయన వెంట కుమారసంభవము చదువుతున్న శిష్యుడు వెళ్ళాడు.
అనంతరావుగారికి పండితులతో పొగిడించుకోవెను అనెడి
కోరిక కలవాడని శాస్త్రులవారికి తెలియును.
అక్కడివారు శాస్త్రులను ప్రాచీన శ్లోకములకు సందర్భానుసారముగా
నానార్థములను చెప్పు సామర్థ్యము కలవారని
వారిచే ఏదైనా శ్లోకం వింత అర్థంతో చెప్పించమని
అనంతరావుగారిచే అడిగించిరి.
శిష్యుడు కుమారసంభవములోని శ్లోకం చదువగా
దానికి శాస్త్రులుగారు ఈ వ్యాఖ్యానం చేశారు.
అనంతరత్న ప్రభవస్యయస్య:
హిమన్న సౌభాగ్యవిలోపిజాతమ్
ఏకోహి దోషో గుణసన్నిపాతే
నిమజ్జతీందో: కిరణేష్వివాంక:
(కుమారసంభవమ్ 1-03)
అర్థం-
హే అనంతరత్న= రత్నమువంటి ఓ అనంతరాయా!
హి = ఎందులన, జాతమ్ = (నీయొక్క)పుట్టుక,
మన్న సౌభాగ్యవిలోపి = నా (మంగళేశ్వరశాస్త్రుల) ఇబ్బందిని
తీర్చునది అయినదో, అందువలన, అయస్య = శుభకర్మమునకు,
ప్రభవసి = తగుచున్నావు, (కాని) ఏక: = ఒక్కటి,
అహిదోష: = సర్పదోషము (కలదు)
అనగా సర్పమునకు రెండు నాల్కలుండును, అట్లే నీవు
రెండు భాషలాడుదువు(దుబాసి, ద్విభాషి),
ఇది, గుణసన్నిపాతే = గుణములసమూహమున,
నిమజ్జతి = మునుగుచున్నది.
ఇందో:కిరణేషు = చంద్రకిరణములందు,
అంక ఇవ = కళంకమువలె-
అని వివరణ ఇచ్చెను.
(దీని అసలు అర్థము-
లెక్కలేని శ్రేష్ఠవస్తువులకు పుట్టినిల్లయిన ఆ హిమవంతునికి
మంచువలన సొంపేమి తరుగదు. ఎట్లాగంటే లోకములో
అనేక గుణముల మొత్తములో
ఒక్కదోషము లెక్కకురాదు కదా!
చంద్రుని వెలుగులలో మచ్చలెక్కకు రానట్లు.)
1 comment:
కొండగు మంచిదనంబగు
దండిని నొక్కింత సోకు తరుణికి కొరతా !
నిండగు బంగరు పర్వత
మందున నొక్కింత హిమము మహిలో కొరతా !
జిలేబి
Post a Comment