Thursday, July 7, 2016

ఏమే యెక్కడ నున్నదాన? విట రావే!


ఏమే యెక్కడ నున్నదాన? విట రావే!


సాహితీమిత్రులారా!

మాయలేడిని చంపి తిరిగి వచ్చిన తరువాత
రామ - లక్ష్మణులకు జరిగిన సంభాషణ
భాస్కరరామాయణంలోని
ఈ పద్యంలో చూడండి.

ఏమెట్టీయది? మెట్టుగా దిది వనం బేరాకుమారుండనో 
సౌమిత్రీ! విను నీవు రాముఁడవె, వత్సా! నిక్క మే రాముండన్  
భూమీశుండవు రామచంద్రుఁడవు - హా! భూమీజ! చంద్రాననా!
యేమే యెక్కడ నున్నదాన విట రావే యుల్ల మల్లాడెడిన్!

                                                    (భాస్కరరామాయణము అరణ్య. - 260)

రాముడు - లక్ష్మణా! ఇది ఏ ఆశ్రయమయ్యా చెప్పు.
లక్ష్మణుడు - ఇది ఆశ్రయం కాదు అడవి సుమా!
రాముడు - అయితే -  సౌమిత్రీ! నేను రాచకొడుకునేనా?
లక్ష్మణుడు - అవును -  విను -  నీవు రాముడవే. 
రాముడు - నాయనా! నేను నిజంగా రాముడనేనా? చెప్పు 
లక్ష్మణుడు - నీవు కోసల భూమీశుడవు, రామచంద్రుడవయ్యా.
                  (భూమీశుడవులో భూమి, రామచంద్రుడులో చంద్రుడు వినగానే-
                   భూమిపుత్రి - చంద్రుని వంటి ముఖముగలది సీత గుర్తుకు వచ్చింది.)
రాముడు - హా! భూమిపుత్రీ! చంద్రాననా! ఏమే సీతా! ఎక్కడున్నావు? 
                 నామనస్సు ఆందోళన చెందుతూంది ఇక్కడకు రావే! (అని పరితపించాడు.)

No comments: