Wednesday, July 27, 2016

రామపాదగతాభాసా


రామపాదగతాభాసా


సాహితీమిత్రులారా!

అనులోమ ప్రతిలోమపాదము అని
మునుపు తెలుసుకొని ఉన్నాము.
ఇక్కడ మరొకటి.
ఒక పాదం మొదటినుండి చివరకు
చదివితే అది అనులోమము.
దాన్నే చివరినుండి మొదటికి
చదివితే అది ప్రతిలోమమం.
ఏలా చదివినా మారకుండా
అలాగే ఉండటం చేత దీన్ని
అనులోమ ప్రతిలోమపాదం అంటారు.
వేదాంతదేశికులవారి
పాదుకాసహస్రంలోని
ఈ శ్లోకం చూడండి.

రామపాదగతాభాసా
సాభాతాగదపామరా
కాదుపానఞ్చకాసహ్యా
హ్యాసకాఞ్చనపాదుకా
                        (పాదుకాసహస్రము -919)


(శ్రీరాముని పాదాలను ఆశ్రయించిన బంగారు
పాదుక స్వీయకాంతితో మిక్కిలి ప్రకాశించేది.
దేవతలను వారి విరోధుల వల్ల కలిగే
మానసిక వ్యాధులనుంచి రక్షించేది.
పాదుకలను ఉపాసిస్తూ జ్ఞానానుష్ఠానాలు
లేని పామరజనులకు వ్యాధులు రాకుండా సుఖాన్ని కలిగించేది.
చతుర్ముఖ బ్రహ్మచేత, ఆరాధించబడే శ్రీరంగనాథుడు
సూర్యవంశస్థుడైన ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించడం వల్ల
పాదుకలు అయోధ్యకు చేరుకొన్నది.
అయోధ్యలో సూర్యునికన్నా
ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉండింది.)

ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని
చివరనుండి మొదటికి చదివిన
2వ పాదము వస్తుంది.
అలాగే 3వ పాదం చివరనుండి చదివిన
4వ పాదం వస్తుంది.
కావున ఇది అనులోమ ప్రతిలోమపాదశ్లోకం 
అనబడుచున్నది.

2 comments:

నీహారిక said...


గతాభాసా
సాభాతాగద
పానఞ్చకాసహ్యా
హ్యాసకాఞ్చన

వీటి అర్ధాలు తెలుపగలరు.

ఏ.వి.రమణరాజు said...


నీహారికగారికి,
ప్రతిదానికి వీలైనంత వరకు అర్థాన్ని ఇస్తున్నాను ప్రతి విషయం పతిపదార్థంతో ఇవ్వడం సాధ్యం కాదు నేను కూడా గొప్ప పండితుణ్ణికాదు.

అయినా ఇప్పుడు దీనికి వివరిస్తాను.
రామపాదగతా = రాముని పాదాలయందు ఉండునట్టిది, భాసా = కాంతిచేత, భాతా = ప్రకాశిస్తున్న, గదపామరా - గద = వ్యాధులనుంచి, ప = రక్షింపబడే, అమరా = దేవతలు కలిగినది, అగదపామరా = రోగాలులేని పామర జనులుగలది. సా = ఆ, కాంచనపాదుకా = బంగారు పాదుక, కాత్ = బ్రహ్మనుంచి, ఉప + ఆనంచ - (అయోధ్యకు) వచ్చెను, క + అసహ్యా = సూర్యునికి సహింప శక్యం కానిదై, అస = (ప్రకాశిస్తు) ఉండెను, హి = ప్రసిద్ధంకదా!


నేను 2012 నుండి చిత్రకవితా సౌరభం అనే పేరుతో ఒక బృహత్తర గ్రంథాన్ని మొదలు పెట్టాను ఇప్పటికి చిత్రకవిత్వాని సంబంధించి అన్ని అంశాలతో కూడిన సమగ్ర గ్రంథం లేదని దాన్ని మొదలు పెట్టాను. అందులో అన్ని వివరాలతో పొందు పరుస్తున్నాను. మీరు అడిగారు గనుక ఇప్పుడు దీనికి వివరంగా అర్థాలిస్తున్నాను.