Saturday, July 2, 2016

స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పు నెద్ది?


స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పు నెద్ది?


సాహితీమిత్రులారా!

పొడుపు పద్యాలు చాలా రకాలు వాటిలో కొన్ని
ముందు తెలిసికొని ఉన్నాము.
ఇప్పుడు
ఈ పొడుపు పద్యం చూడండి.

పార్థ శంకరులేల పైకొని పెనగిరి?
       పతి బాసి, చాయ ఏ పగిది నుండె?
చింతచిగురునందు చెలగెడు రుచి ఏది?
       స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పునెద్ది?
తపసుచే నేమిట దనరు సాధింపంగ?
       ధర్మవ్యాధు డెవరు ధరణిలోన?
అతివ కందము నిచ్చునది యేది ధరలోన?
       "జీవంతి" యని దేని చెప్పుచుంద్రు?
అన్నిటికి జూడ మూడేసి అక్షరములు
ఈవ లావల జూచిన ఏకవిధము
చిత్తభవభంగ శివలింగ చిన్మయాంగ
వృషతురంగ శుభాంగ గౌరీశ లింగ

దీనిలోని షరతులు
1. ప్రతి సమాధానము మూడు అక్షరాలతో ఉండాలి.
2. ఆ సమాధానం ఎటుచూచినా(చదివినా) ఒకే విధంగా ఉండాలి.
ఇక ఆలోచించండి.

1. అర్జునుడు, శివుడు ఒకరిపై ఒకరు ఎందుకు పెనబడి పోరాడారు?
   - కిటికి (పందికై)
2. భర్తకుదూరమైన చాయ ఏవిధంగా ఉండెను?
   - బడబ (ఆడు గుర్రము - ఆకారంలో)
3. చింత చిగురులో ఏమి రుచి ఉన్నది?
   - పులుపు
4. స్త్రీ యొక్క జాణతనాన్ని చాటేది ఏది?
   - కులుకు (విలాసం)
5. తపస్సుచేసి సాధింప వీలైనది ఏది?
   - మహిమ(గొప్పదనము)
6. ధరలో ఉన్న ధర్మవ్యాధుడు ఎవరు?
   - కటిక(వాడు)
7. ధరణిలో ఆడుదానికి అందాన్నిచ్చేది ఏది?
   - వలువ (వస్త్రము)
8. వేటిని జీవన్తి అని పిలుస్తారు?
   - కరక (కరక్కాయ, పాలకూర, తిప్పతీగ-లను)

No comments: