Friday, April 28, 2017

కరిముఖు డశ్వినుల్ శ్రుతులు


కరిముఖు డశ్వినుల్ శ్రుతులు




సాహితీమిత్రులారా!


మంచన  కేయూరబాహు చరిత్రలోని
సంఖ్యా(శబ్ద)చిత్రము చూడండి-


కరిముఖు డశ్వినుల్ శ్రుతులు కంజసముద్భవు మోము నంబికే
శ్వరు మొగముల్ తదాత్మజుని వృక్షము లాది మునీంద్ర మండలం
బురగపతుల్ గ్రహంబులు పయోరుహనాభుడు తారకంబు లున్
బొరిబొరి నెల్ల సంపదలు పోలమ గుండని కిచ్చుగావుతన్


ఇందులో
కరిముఖుడు - వినాయకుడు (ఒకడు)
అశ్వనుల్ - అశ్వనీదేవతలు (ఇద్దరు)
శ్రుతులు - వేదములు (మూడు)
కంజసముద్భవు మోము- చతుర్ముఖుడు(నాలుగు)
అంబికేశ్వరు మొగముల్ - పంచాస్యుడు(శివుడు)(ఐదు)
తదాత్మజుని వక్రములాది -
శివుని కుమారుడైన షణ్ముఖుని ముఖములు(ఆరు)
మునీంద్ర మండలంబు - సప్తఋషులు (ఏడు)
ఉరగపతుల్ - అష్టనాగులు (ఎనిమిది)
గ్రహంబులు - నవగ్రహాలు (తొమ్మిది)
పయోరుహనాభుడు - దశావతారములెత్తిన విష్ణువు(పది)
తారకంబులున్ - అనంతములైన తారకలు(అనంతము)
పోలమ గుండనికి  అనంత సంపదలు ఇచ్చుగాక
అని మంచన తన కృతిపతిని దీవిస్తున్నాడు.

ఇందులో ఒకటి నుండి పది మరియు
అనంతము అనే సంఖ్యలు
కనిపిస్తున్నాయి కావున ఇది
సంఖ్య(శబ్ద) చిత్రముగా చెప్పబడుతున్నది.

No comments: