Monday, April 3, 2017

విహరించున్ మలయానిలం బిచట


విహరించున్ మలయానిలం బిచట




సాహితీమిత్రులారా!



చేమకూర వేంకటకవి విజయవిలాసము
అనేక చమత్కారాలకు కాణాచి.
ఇక్కడ మనం సంవాదచిత్రంలోని
ఈ పద్యాన్ని చూద్దాం.

అర్జునుడు తీర్థయాత్రకు ప్యాణమై
పోతున్నసమయంలో  సౌభద్రతీర్థంలో
మొసళ్ళకు శాపవిమోచనం కలిగిస్తాడు
అప్పుడు శాపవిమోచనం పొందిన నంద అనే
అప్సరస తన వృత్తాంతం చెప్పే సమయంలోనిది
ఈ పద్యం-
నలుగురు చెలికత్తెలు నంద కలిసి ఒక తోటలో విహరిస్తూ
ఆవనాన్ని ఇలా మెచ్చుకున్నారు.

విహరించున్ మలయానిలం బిచట దావింజిల్కి నెమ్మేని యా
విహరించున్ బికనాదముల్ చెవికి గావించున్ జవుల్... పోద మా
సహకారాళిపదంబు జూడగ వయస్యా హాళివాటిల్లెడున్
సహకారాళిపదంబు జూడ వయస్యా హాళియౌనే కదా
(విజయవిలాసము - 2- 53)



మొదటి చెలికత్తె-
విహరించున్ మలయానిలం బిచట
ఈ వనంలో మలయమారుతం మందమందగా వీస్తున్నది సుమా

రెండవ చెలికత్తె -
దావింజిల్కి నెమ్మేని యా విహరించున్
ఔను చక్కగా చెప్పావు. అంతే కాదు కమ్మని వాసనలను
చల్లి చక్కని శరీరాల ఉష్ణాన్ని పోగొడుతుందికూడా
(నీవు విహరించునని చెప్పావు కదా
ఆ మాటలోని వి- అనే అక్షరాన్ని తీసివేస్తే
విహరించున్ - విపోతే హరించున్ మిగులుతుంది
కాబట్టి ఆ వి - ని హరిస్తుంది- అనిచమత్కారం.)

మూడవ చెలికత్తె -
బికనాదముల్ చెవికి గావించున్ జవుల్... 
ఆడకోయిలల కంఠధ్వనులు చెవులకు రుచులను కలిగిస్తున్నవి.
(పికినాదములు చెవులకు సంతోషంకోసం
రుచివంతంగా పాటలను వినిపిస్తున్నాయి.)

నాల్గవ చెలికత్తె -
 పోద మా సహకారాళిపదంబు జూడగ వయస్యా
చెలీ ఆ కనబడుతున్న తియ్యమామిడిచెట్ల వరుస ఉన్న
స్థలాన్ని చూడగా ఆసక్తిని కలిగిస్తున్నది రమ్ము పోదాము

అయిదవ చెలికత్తె -
 హాళివాటిల్లెడున్  సహకారాళిపదంబు జూడ 
వయస్యా హాళియౌనే కదా
బాగా చెప్పావు సహకారములోని హ తో కూడిన ఆళి అనే పదం
హాళి అని అవుతుంది కదా కాబట్టి తప్పక సంతోషం కలుగుతుంది
(సహకారము - తియ్యమామిడి చెట్లయందలి,
ఆళి - తుమ్మెదల పాటలు వింటే సంతోషం కలుగుతుందికదా)

No comments: