Tuesday, April 11, 2017

తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె


తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె




సాహితీమిత్రులారా!


సమస్య-
తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె
తల్లి పుత్రసాంగత్యమున పుత్రునిగనెని సమస్య

సి.వి.సుబ్బన్నగారి పూరణ-

శంబరాసురుండు డంబునఁ గొనిపోయి
జలధివైచె శిశువు ఝషము మ్రింగె
దయిత బాలుఁబెంచె దనుజునింట రతి, ఆ
తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె

ఇది భాగవతంలోని కథ
మన్మథుడు ప్రద్యుమ్నుడై పుట్టగా
ఆ శిశువును శంబరుడనే రాక్షసుడు
సముద్రంలో పడవేస్తే చేప మ్రింగింది.
దైవవశమున బాలుని మ్రింగిన చేపను
శంబరుని వంటఇంటికే తెచ్చారు.
నారదుని ఉపదేశం మేరకు అక్కడరతీదేవి
కాచుకొని చేపను కోసి పిల్లవాణ్ని తీసి రహస్యంగా
పెంచి పెద్దచేయగా పెద్దైన ఆ శిశువు శంబరుని
వధించెను. తల్లివలె పెంచిన ఆ తరుణిని
భార్యగా స్వీకరించాడు. ఆ తల్లి కొమరునిబొంది
తనయు గనెనని చెప్పబడెను. - ఊ పూరణలో
ఇంత కథ ఉంది.
ఇక్కడ తల్లిగాదు ఆ తల్లి అంటే పెంచిన తల్లి
అని రావడంతో సమస్య సమసింది.

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.

No comments: